ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఉదయంరాజ్ భవన్ కు వెళ్లి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ, ఆ లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే చంద్రబాబు రాజ్ భవన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా పలు అంశాలపై చర్చ సాగినట్టు సమాచారం.
నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్లే విమానంలో చంద్రబాబు బయలుదేరగా వాతావరణం అనుకూలించక అది బెంగళూరులో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఇదిలావుండగా, ఈ సాయంత్రం గవర్నర్ విజయవాడకు చేరుకోనున్నారు. రేపు ఉదయం ఆయన నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.