telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ రాజకీయమే.. సభ్యులను మాయం చేసి.. ట్రిపుల్ తలాక్ బిల్లు గెలిపించుకున్న బీజేపీ…

narendra-modi

మొత్తానికి ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఉభయసభల్లో ఈ బిల్లుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇకమీదట ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఆమోదానికి 121 ఓట్లు కావాలి. అయితే, పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దాంతో సభలో అందుబాటులో ఉన్న సభ్యులతోనే ఓటింగ్ నిర్వహించారు. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది.

ట్రిపుల్ తలాక్ పద్ధతిని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే తలాక్ పై నిషేధం విధించాయని చెబుతూ ఎన్డీయే ఎప్పటినుంచో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు పోరాడుతోంది. ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న తరుణంలో లౌకిక దేశమైన భారత్ లో ఎందుకు రద్దు చేయలేమంటూ మోదీ సర్కారు ఈ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే చెప్పింది. ఇన్నాళ్లకు లోక్ సభ, రాజ్యసభలో దీనిపై బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు త్వరలోనే రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల స్పందించారు. ముస్లిం మహిళల పట్ల ఓ చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసిందని వ్యాఖ్యానించారు. మధ్యయుగాల నాటి మూఢాచారం చివరికి చరిత్ర చెత్తబుట్టలోకి చేరిందని ట్వీట్ చేశారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఇది గొప్ప విజయం అని మోదీ అభివర్ణించారు. భారత్ ఉప్పొంగిపోయే సుదినం అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు సహకరించిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related posts