telugu navyamedia
క్రైమ్ వార్తలు

యాదాద్రి జిల్లాలో ఖాకీల క‌ర్క‌శ‌త్వం : బిడ్డ‌కు బాగోలేద‌న్నా విన‌లేదు

*యాదాద్రి జిల్లాలో దారుణం..
*పోలీసుల తీరుతో మూడు నెల‌ల ప‌సికందు మృతి..
*ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబును ఆస్ప‌త్రికి తీసుకెళుతుండ‌గా కారును ఆపిన పోలీసులు
*కారుపై ఉన్న చ‌లానా క‌ట్టాల‌న్న పోలీసులు
*చ‌లానా క‌ట్టిన త‌రువాత కారును వ‌దిలిన పోలీసులు
*పోలీసులు ఆప‌డం వ‌ల‌నే నా బిడ్డ చ‌నిపోయాడంటూ తల్లి కన్నీరు మున్నీరు
*పోలీసుల తీరుపై బాలుడి కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న‌

యాదాద్రి భువనగిరి జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌తో మూడు నెల‌ల ప‌సికందు మృతి చెందాడు..ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబును ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. పోలీసులు అరగంట సేపు కారు ఆపడం వల్ల వైద్యం ఆలస్యమై ఆ బాలుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం శివారులో మంగళవారం రోజున చోటు చేసుకుంది.
వివ‌రాల్లోకి వెళితే..
జనగామ జిల్లా జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతుల మూడు నెలల వయస్సున్న కొడుకు రేవంత్‌ అనారోగ్యానికి గురవడంతో మంగళవారం జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి సిఫార్సు చేశారు.

దీంతో అందుబాటులో ఉన్న కారును అద్దెకు తీసుకున్న తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్‌ కు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే పోలీసులు వాహన చలాన్ల తనిఖీల్లో భాగంగా స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు ఆ అద్దె కారును ఆపారు.

ఆ కారుకు గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల దాదాపు రూ.1,100 మేర చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే వదులుతామని పోలీసులు చెప్పారు.

తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదని మల్లేశ, సరస్వతి వాపోయారు. కారు డ్రైవర్‌ సాయి వంగపల్లి సమీపంలో ఉన్న మీ-సేవ కేంద్రానికి వెళ్లి చలానా కట్టి వచ్చేందుకు దాదాపు అరగంట సమయం పట్టింద‌ని తెలిపారు.
ఆ తర్వాత ప్రయాణమయ్యాయమని, తార్నాక చేరుకోగానే బాలుడిలో కదలికలు లేవని బాధితులు, డ్రైవర్‌ చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లాకా.. వైద్యులు చూసి ‘బాబు చనిపోయి అరగంట అవుతుంది’ అని నిర్ధారించారని వాపోయారు.

కాగా.. సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఉంటేే మా బాబు బతికేవాడని తల్లి కన్నీరు మున్నీరవుతుంది. పోలీసుల తీరుపై బాలుడి కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు.

Related posts