telugu navyamedia
క్రైమ్ వార్తలు

జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి..

జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‌పై  ఉగ్రవాదులుఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు

ఈ ఘటన రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలోని దర్హల్ ప్రాంతం పర్గల్‌లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా దాడి జరిగింది. రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్​ ఫెన్సింగ్​ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. హతమైన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలిసింది.

చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా అధికారులు తెలిపారు. తీవ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిలో ఒక అధికారి కూడా ఉన్నారు. వారందరినీ వైద్య చికిత్స కోసం తరలించారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.

Related posts