దివిసీమ ఉప్పెనకు 46 సంవత్సరాలు కృష్ణ జిల్లా దివిసీమలో 1977 నవంబర్ 19న ఉప్పెన విరుచుకుపడి వేలాది మంది ప్రజల ప్రాణాలను హరించింది . ఇది ప్రకృతి మహా ప్రళయం , కానీ వినీ ఎరుగని విలయం .
ఈ విపత్తులో కొన్ని గ్రామాలు పూర్తిగా వరదలో కలసి పోయాయి. వేలాది ప్రజలు ఇళ్ళు కోల్పోయి , నిల్వ నీడ లేకుండా , తినడానికి తిండి లేక , తాగడానికి నీళ్లు లేక అల్లాడి పోయారు . ఇక చాలా వరకు మూగ జీవాలు మృత్యువాత పడగా మిగిలినవి ఆకలితో అలమటించి పోయాయి . ఆ హృదయ విదారకమైన ఆకలి కేకలు అటు ప్రభుత్వాన్ని , ఇటు ప్రజలను కదిలించాయి .
బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి అగ్రనటుడు ఎన్ .టి .రామారావు , అక్కినేని నాగేశ్వర రావు నడుం కట్టారు . తాత్కాలికంగా సినిమా షూటింగులకు విరామం ప్రకటించారు .
ముందుగా హైద్రాబాద్ లో ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి జోలెలు పట్టారు . రామారావు ,నాగేశ్వర రావు ముందు జీపులో , నావెనుక లారీల్లో మిగతా నటీ నటులు కూడా జోలెలు పట్టారు .
అదే సంవత్సరం నేను వెండితెర సినిమా వార పత్రికలో రిపోర్టర్ గా చేరాను . ఈ ర్యాలీలో తారలతో పాటు నేను కూడా పాల్గొన్నాను. ఆ నాటి దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్నాయి.
ఆరోజు మధ్యాన్నం గోల్కొండ క్రాస్ రోడ్స్ లో వున్నా రామ కృష్ణ సినీ స్టూడియోస్ లో తారలు , నిర్వాహకులు , మీడియాకు రామారావు గారు భోజనాలు ఏర్పాటు చేశారు . ఆ సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి .
ఆ తరువాత విజయవాడ, కర్నూల్, కడప , గుంటూరు , రాజమండ్రి కాకినాడ , విశాఖపట్టణం , వరంగల్ తదితర పట్టణాల్లో పర్యటించి ప్రజల నుంచి విరాళాలు స్వీకరించారు . అప్పట్లో 15 లక్షల రూపాయలు వసూలయ్యాయి . ఈ డబ్బును రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు అందించారు.
సినిమా నటీ నటులు కేవలం తెర మీద వినోదం పంచడానికి కాదు , ప్రజలకు అవసరం వచ్చినప్పుడు అండగా ఉంటామని రామారావు గారు , నాగేశ్వర రావు గారు జోలెలు పట్టి విరాళాలు సేకరించి మరీ చాటి చెప్పారు.
భగీరథ , సీనియర్ జర్నలిస్ట్ .
కుట్రలు చేయొద్దని కేసీఆర్కు నటుడు శివాజీ విజ్ఞప్తి