telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెండితెర పై పువ్వులను కురిపించిన నవ్వుల పారిజాతం కొండలరావు

తెలుగు సినిమా పుట్టుకతోనే మహర్షి రావి కొండలరావు 11, ఫిబ్రవరి 1932న జన్మించి, నేటివరకు సినీ జీవితానికి అంకితమై, 88 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపి 28-07-2020 హైదరాబాద్ వివేకానంద ఆసుపత్రిలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఆ సంపాదక దశరథుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

అతడొక అక్షర శిల్పి. అక్షరాలా తెలుగు మేష్టారు. “రావి”చెట్టు కొమ్మలకున్నన్ని ప్రతిభా విశేషాలు ఆయన సొంతం. “కొండ”కు వున్నంత సాహితీ సంపద ఆయనకు ఆదర్శం. తొలి తెలుగు టాకీ విడుదలైన వారానికే సామర్లకోటలో వుదయించిన ఈ అక్షరశిల్పి రచనాశిల్పంలోని కథ, నాటకం, వ్యాసం, వార్త, గల్పిక, చిత్రానువాదం వంటి అన్ని కోణాలనూ స్పృశించిన కృషీవలుడు. అతడు కదలని రంగస్థలంపై కదిలే మందానిలం. నాగావళి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం చెన్నపట్టణ సముద్రపు అంచులను తాకి బహుముఖీనంగా ప్రవహించి, మంజీర ఒడ్డున సేద తీరేందుకు భాగ్యనగరం చేరుకుంది. సేదతీరటం ఇష్టంలేని ఆయన మనోనేత్రం నటరాజ పదమంజీరార్చనాన్ని, వాగ్దేవీ ప్రసాదిత సాహిత్య జీవధారను నవరస హృదయంతో కొనసాగించమని ఆదేశించింది. సహస్ర చంద్రదర్శనాన్ని దాటిన వయసులోనూ “హ్యూమరథం” మీద పయనాన్ని సాగిస్తూ, తొణికిసలాడే వ్యంగ్య బాణాలను సంధిస్తూ, హ్యూమరసాన్ని పంచుతున్న ఈ “పాత బంగారం” తెలుగు వారికి పరిచయం అఖ్ఖరలేని ‘రావి కొండలరావు’.

Raavi-Kondara-Rao

బాల్యం
పుట్టింది తెలుగు సినిమా పుట్టుకతోబాటు సామర్లకోటలో. పెరిగింది, చదివిందీ శ్రీకాకుళంలో. ఒదుగుతూ యెదిగింది చెన్నపట్నంలో. ఆయన పుట్టినప్పుడే మాట్లాడే బొమ్మలు వెండితెరను అలరించడం మొదలెట్టాయి. చిన్నతనంలో నీట ఈదడం రాని కొండలరాయుడు నాగావళీ నది సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆ గండం గడిచి గట్టెక్కిన కొన్నేళ్ళకే అర్థరాత్రి స్నేహితునితో కలిసి సైకిలు మీద వస్తుండగా “దయ్యాలు” యెత్తుకెళ్ళి స్మశానంలో వదిలేశాయి. అమ్మ కంగారు పడి తాయెత్తులు కట్టించి బతికించుకుంది. పెద్దయ్యాక నాటకం ఆడేందుకు మద్రాసు నుంచి తూర్పు తీరానికి వెళుతున్నప్పుడు తను ప్రయాణిస్తున్న రైలు పెట్టె వంతెన మీదనుంచి దొర్లి కింద పడి గాయాలైతే, ఆ భగవంతుడే కాపాడి ఆరోగ్యాన్ని నిలబెట్టాడు. చిన్నతనం నుంచే కొండలరావు కు సినిమాలన్నా, నాటకాలన్నా మక్కువ. అన్నయ్యలిద్దరూ నటులే. నాన్నకు తెలియకుండా స్కూలు వేదికలపై నాటకాలు వేసేవారు. తన పదవ యేటనే రంగస్థలం మీద తొలి పాత్ర పోషించారు. సురభి కంపెనీ వారు ఆడే నాటకాలను చూస్తూ వారు పాడుతున్న పాటల్ని, పద్యాలని మననం చేసుకుంటూ అభ్యాసం చేసేవారు. RSS సంస్థలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు, ఆ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. ఆ సందర్భంగా సత్యాగ్రహంలో పాల్గొన్న కొండలరావు కు ప్రభుత్వం మూడు నెలల కారాగార శిక్ష విధించింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో వున్నప్పుడు ఆ జైలు గ్రంధాలయంలో వున్న గొప్పగొప్ప రచనలను పఠిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సాహిత్యాభిలాష ను పెంచుకున్నారు. పన్నెండో యేట నుంచే చిన్నచిన్న రచనలు చేసి “బాల” అనే పత్రికలో అచ్చైన తనపేరు చూసుకొని మురిసిపోయేవారు. అప్పుడే ఒక లిఖిత పత్రికను కూడా ప్రవేశపెట్టారు. తీరిక సమయాల్లో స్థానిక పత్రిక “మహోదయ” కార్యాలయానికి వెళ్లి చిన్న వ్యాసాలూ, సినిమా సమీక్షలూ రాస్తూ స్వచ్చంద సేవ చేసేవారు. “సుకుమార్” అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అదే ఉత్సాహం “బంగారు పాప” అనే పిల్లల పత్రిక నడిపే స్థాయికి తీసుకెళ్ళింది. అమ్మకు సంగీతం వచ్చు. ఆమె సహకారంతో సంగీతంలో మెళకువలు నేర్చుకొని హార్మోనియం వాయించే స్థాయిని అందుకున్నారు. శ్రీకాకుళంలో “సుకుమార్ ఆర్కెష్ట్రా” ను స్థాపించి కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంస్థ ఇప్పటికీ విజయవంతంగా నడుస్తుండడం విశేషం.

ఛలో చెన్నపట్నం
ప్రఖ్యాత దర్శక నిర్మాత యల్వి. ప్రసాద్, ప్రముఖ హాస్యనటులు రేలంగి వెంకట్రామయ్య వంటి సినీ దిగ్గజాలు సినిమాల్లో చేరాలని ఇంట్లో చెప్పకుండా రైలెక్కినట్లే, కొండలరావు కూడా తన పదహారవ యేటనే ఓ మిత్రుని వద్ద ఇరవై రూపాయలు పుచ్చుకొని చెన్నపట్నం వెళ్ళే రైలెక్కేశారు. అక్కడకు వెళ్ళాక బ్రతుకెంత దుర్బరమో తెలిసింది. ఆ మహానగరంలో బస్సెక్కదానికి కూడా డబ్బులు చాలక రోడ్లవెంట నడిచారు. అర్థాకలితో యెన్నో అవస్థలు పడ్డారు. గాయకుడిగా నైనా నిలదొక్కుకోవాలని ప్రయత్నించారు. అలా కొన్ని ఘంటసాల పాటలకు కోరస్ పాడారు. ఆ సమయంలోనే ప్రతిష్టాత్మక ‘భారతి” మాసపత్రికలో కొండలరావు నాటిక “కుక్కపిల్ల దొరికింది” ప్రచురితమైంది. దానితో “ఆనందవాణి” పత్రికలో సహాయకుడిగా చోటు దొరికింది. కానీ జీతాలు ఇవ్వని కారణంగా తప్పుకోవలసి వచ్చింది. అంతకుముందు హైదరాబాదులో జరిగిన నాటకపోటీలలో నటరాజ కళా సమితి తరఫున ప్రదర్శించిన “కాళరాత్రి” నాటకానికి బహుమతి వచ్చినప్పుడు, ప్రఖ్యాత సినీ రచయిత డి.వి. నరసరాజు తో పరిచయమైంది. ఆ పరిచయాన్ని గుర్తు చేస్తూ కొండరావు నరసరాజును కలిశారు. అతని సహకారంతో పొన్నలూరి బ్రదర్స్ నిర్మాణ సంస్థలో కథా విభాగంలో చేరారు. వారు నిర్మించిన “శోభ” చిత్రానికి సహాయ దర్శకులుగా వ్యవహరించడమే కాకుండా డాక్టరుగా ఒక చిన్న వేషం కూడా వేశారు. విఖ్యాత దర్శకులు కమలాకర కామేశ్వరరావు తో పరిచయమై దర్శకత్వ విభాగంలో మెళకువలు నేర్చుకున్నారు. బి.యన్. రెడ్డి వద్ద వుంటూ దర్శకుడంటే యెలా ఉండాలో ఆకళింపు చేసుకున్నారు. సముద్రాల రాఘవాచార్య, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, ఆరుద్ర వంటి సాహితీ స్రష్టలకు సన్నిహితంగా మెలగుతూ సాహిత్య క్రమశిక్షణ అలవరచుకున్నారు. తరచూ పానగల్ పార్కులో వారు నిర్వహించే సాహిత్య గోష్టి లో శ్రోతగా పాల్గొనేవారు. కొండలరావు తొలి కథ “దైవేచ్చ” యువ మాస పత్రికలో అచ్చయింది. అయన రచించిన “నాలుగిళ్ళ చావిడి”, “ప్రొఫెసర్ పరబ్రహ్మం”, “పట్టాలు తప్పిన బండి”, “ఉరిశిక్ష” నాటకాలు దేశవ్యాప్తంగా అనేకసార్లు ప్రదర్శనకు నోచుకున్నాయి.

రచయితగా నంది బహుమతి
అరవయ్యో దశాబ్దం కుర్రకారు ప్రేమకథల కాలంగా పరిగణించేవారు. కాలానుగుణంగా కొండలరావు కూడా కొన్ని రసగుళికలవంటి ప్రేమ కథలు రాశారు. మనుషుల మనస్తత్వాలను పసిగట్టి, వాటిని విశ్లేషించి, హాస్యాన్ని జోడిస్తూ కొండలరావు రాసిన కథలు రాశిలో కొన్నే అయినా వాసికెక్కినవిగా గుర్తింపు పొందాయి. “రామ్మూర్తి పెళ్లయింది”, “చంద్రశేఖరుని కథ”, “ఆత్మహత్య”, “సుబ్బారావు-సూర్యకాంతి” మొదలైనవి కొండలరావు కలం పండించిన కుర్రకారు ప్రేమకథలే. “అసంభవామి యుగేయుగే” కథలో విష్ణుమూర్తి, కృష్ణుని రూపంలో వచ్చి, సత్యభామకు కలియుగ భూలోక దుస్థితి హాస్య చమత్కారాలతో వివరించే తీరు ముచ్చట గొలుపుతుంది. “చావుల కొండ” కథలో పెద్దపోలీసు వెల్లడించే విషపు ముగింపు కలవరపరుస్తుంది. “నాణెం” అనే సినిమానటి కథ గానీ, “నిరుద్యోగపర్వం” అనే ఒక నిరుద్యోగి కథగానీ ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఇక “దిదృక్ష”, “ముమూర్ష”, “రైలు పట్టాలు” అనే కథలు వివిధ జీవిత సత్యాలను ప్రతిబింబింపజేస్తాయి. దిదృక్ష అంటే కోరిక అని చెప్పవచ్చు. ఒక ఉద్యోగి తన చావు వార్త విని తనవాళ్ళంతా యెలా స్పందిస్తారో చూడాలని ఆడే నాటకంగా ఈ కథను మలిచారు. ముమూర్ష అంటే చనిపోవాలనే కోరిక. ఈ కథ కూడా అలాంటిదే. ఇక “రైలు పట్టాలు” కథ మనుషుల మనసుల తర్కాన్ని, జాగ్రత్తని తెలియజేస్తుంది. ఇలా కొండలరావు అటు ప్రేమనీ ఇటు విషాదాన్నీ తన కథలలో అలవోకగా చిత్రీకరించారు. ఇక నాటికల విషయానికొస్తే “రాయి భారం”, “కుక్కపిల్ల దొరికింది”, “అంతరాయానికి చింతిస్తున్నాం”, “చుట్టం కొంప ముంచాడు”, “కథ కంచికి”, “మా ఇల్లు అద్దెకిస్తాం” వేటికవే ప్రత్యేకం. సినిమా నేపథ్యంలో రచించిన “బ్లాక్ అండ్ వైట్” నవలకు కొండలరావు ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నారు. గురజాడ వారి ప్రసిద్ధనాటకం “కన్యాశుల్కం”ను రచనలో వున్నవిధంగానే దూరదర్శన్ వారికి టెలివిజన్ సీరియల్ గా తీసి పెట్టారు. ఈ సీరియల్ అనేకసార్లు ప్రసారానికి నోచుకుంది.

సినీ ప్రస్థానం
కమలాకర కామేశ్వరరావుకు సహాయకుడుగా “నర్తనశాల” సినిమాకు పనిచేస్తున్నప్పుడు, ఉత్తర కుమారుని పాత్రకు సముద్రాల రాఘవాచార్య సమకూర్చిన సన్నివేశాలు, సంభాషణలు పేలవంగా వున్నాయని, భావించి కొండలరావును రాయమని కామేశ్వరరావు ఆదేశించారు. భయపడుతూనే ఆ సన్నివేశాలకు కొండలరావు కొత్త రూపం కల్పించారు. ఆ రచనను సముద్రాల చూసి “భేషుగ్గా వున్నాయి. అక్షరం కూడా మార్చనక్కరలేదు” అని మనసారా మెచ్చుకున్నారు. హాస్య రచనకు కొండలరావు వేసిన తొలి అడుగు అదే! 1964లో ముళ్ళపూడి వెంకట రమణ వీరిని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు పరిచయం చేస్తే “దాగుడుమూతలు” సినిమాలో డాక్టరు వేషమిచ్చి ప్రోత్సహించారు. నిర్మాత, దర్శకుడు పి.పుల్లయ్య నిర్మించిన “ప్రేమించి చూడు” కామెడీ సినిమాకు ముళ్ళపూడి సంభాషణలు రాశారు. అందులో అక్కినేని తండ్రి పాత్రకు ముళ్ళపూడి కొండలరావును సిఫారసు చేసి, పుల్లయ్యవద్దకు పంపారు. ముప్పయ్యో పడిలో దబ్బపండురంగుతో మిసమిసలాడుతున్న కొండలరావు ను చూసి “ఆ రమణకు బుద్ధిలేకపోతే నీకులేదా. నువ్వు నాగేశ్వరరావుకు తండ్రివా. అయాం నాట్ ఎ ఫూల్. ఫస్ట్ గెటవుట్” అన్నారు. కొడవటిగంటి, ప్రతిభాశాస్త్రి నచ్చజెప్పడంతో ఆ మేస్టారి పాత్ర కొండలరావుకు దక్కింది. “సైలెన్స్” అంటూ నవ్వుపుట్టించిన ఆ స్కూలు మేస్టారి పాత్ర ఆ సినిమాలో బాగా పండింది. కొండలరావు నటనా ప్రస్థానానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక సినిమా వేషాలకోసం ఆయన వెనక్కు చూసుకోలేదు. యన్టీఆర్ సొంత సినిమా “వరకట్నం” లో రాజనాల వెంటవుండే భట్టుమూర్తి అనే భట్రాజు పాత్రలో “మహాప్రభో” అంటూ ఒదిగి పోయారు. ఇక “బ్రహ్మచారి” “నిర్దోషి” సినిమాలలో డాక్టరు పాత్ర దేనికదే ప్రత్యేకం. పాత్రల స్వభావాన్నిబట్టి డైలాగు మాడ్యులేషన్ మార్చుకుంటూ, నిర్మాత దర్శకుల “ఇగో” దెబ్బతినకుండా ముందస్తు అనుమతితో సరికొత్త ప్రయోగాలు చేసి “శబాష్” అనిపించుకున్నారు. అందుకే కొండలరావు నటించిన పాత్రలు చిన్నవే అయినా యెంతో సహజంగా ఉండేవి. “అర్థరాత్రి” సినిమాలో కొండలరావుది విలన్ పాత్ర. అదికూడా బాగా రాణించింది. “పంతులమ్మ” లో గిరిజకు భార్యాలోలు డైన భర్తగా, “ప్రేమకానుక” లో ఛాయాదేవికి హిన్-పెక్కడ్ భర్తగా, “ముహూర్తబలం”లో సూర్యకాంతంకు భార్యావిధేయుడుగా వైవిధ్యం చూపుతూ నటించిన ప్రతిభ కొండలరావుది. “ఇద్దరు మొనగాళ్ళు” సినిమాలో రాజుగారి తమ్ముడిగా, “మరపురాని కథ” లో న్యాయవాదిగా, “మహాబలుడు” లో మాంత్రికునిగా, “నేనంటే నేనే” లో ఎస్టేటు మేనేజరుగా, “వేములవాడ భీమకవి” లో భీమకవి మేనమామగా, “పాపకోసం” లో బ్రాహ్మణుడిగా, “గాంధీ పుట్టిన దేశం”లో కార్మికుడిగా, “సి.ఐ.డి” లో విలన్ కు సహచరునిగా, “రాముడు-భీముడు”లో రిజిస్ట్రారుగా ఇలా చెప్పుకుంటూ పొతే యెన్నోపాత్రల్లో మరెన్నో అనుభూతులు గుర్తుకొస్తుంటాయి. “బంగారు పంజరం” లో విలన్ పాత్ర పోషించిన కొండలరావుకు నంది పురస్కారం లభించింది. ఆరుద్రకు కొండలరావు అంటే అభిమానం. తన షష్టిపూర్తి సంచికకు కొండలరావు సంపాదకత్వం వహించారు. అందులో ఆరుద్ర కొండలరావు చేత “తెలుగు మేస్టారి ఇంటర్వ్యూ” రాయించి షష్టిపూర్తి వుత్సవంలో ఆయనచేతే చదివించారు. స్క్రీన్ ప్లే రచయితగా “చల్లని నీడ”, “భైరవద్వీపం”, “బృందావనం” వంటి చిత్రాలు కొండలరావుకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. “బాపు-రమణల “పెళ్లిపుస్తకం” సినిమా కు కథను సమకూర్చింది కొండలరావే.

రాధాకుమారితో ఆయన కళ్యాణం
కొండలరావు సినిమాల్లో సహాయ దర్శకునిగా వున్నప్పుడు రాధాకుమారి తండ్రి “మా అమ్మాయికి సినిమాల్లో నటించాలని వుంది. యేమైనా వేషాలుంటే యిప్పించమని కొండలరావుకు ఉత్తరాలు రాసేవారు. ఆమె మద్రాసు వచ్చాక వేషాల కోసం, డబ్బింగ్ కోసం కొండలరావు ఆమెను వెంటబెట్టుకెళుతుండే వారు. అలా ఇద్దరూ తిరగడం చూసి ఇద్దరిమధ్య ప్రేమాయణం వుందేమో అని అనుకునేవాళ్లు. వాళ్ళది ప్రేమనాటకం కాదు. నాటకమే ప్రేమ. తర్వాత ముళ్ళపూడి సలహాతో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అలా నాటకమే ఇద్దరినీ కలిపింది.

raavi

విజయచిత్ర అనుబంధం
“ఆంధ్రజ్యోతి” దినపత్రికలో ప్రతి శుక్రవారం వెలువడే సినిమా పేజీ రాస్తున్నప్పుడు కొడవటిగంటి కుటుంబరావు ద్వారా చందమామ ఆఫీసులో నాగిరెడ్డి-చక్రపాణిలతో పరిచయం కావడం “విజయచిత్ర” సినిమా పత్రికకు సహాయ దర్శకునిగా పనిచేసే అవకాశాన్ని కల్పించింది. 150 రూపాయల జీతంతో ఆఫీసులో చేరారు. జూలై నెల 1966 లో ఆఫ్ సెట్ ప్రింటుతో “విజయచిత్ర” తొలి కాపీ విడుదలైంది. తొలి సంచికకు సంపాదకీయం రాస్తూ “విజయచిత్ర ఉన్న మంచినే చెబుతుంది. ఉన్నా చెడు చెప్పదు. ఆహ్లాదంతో పాటు కాస్త విజ్ఞానం కూడా కలగజేయడం విజయచిత్ర లక్ష్యం” అంటూ పత్రిక లక్ష్యాన్ని ముందే తెలియజేశారు. ఇదే పత్రికను తమిళంలో “బొమ్మై” పేరుతో సమాంతరంగా ప్రచురించేవారు. సినిమాలలో నటించేందుకు నాగిరెడ్డి-చక్రపాణిలు గాని, నాగిరెడ్డి తనయుడు విశ్వనాథరెడ్డి(సంపాదకుడు) గాని అభ్యంతర పెట్టలేదు. సకాలానికి పత్రిక విడుదలయ్యేలా చూడమని మాత్రమే సలహా ఇచ్చారు. విజయా సంస్థ వారు కొండలరావును తమ కుటుంబ సభ్యునిగానే గౌరవించి మంచి సదుపాయాలు సమకూర్చారు. అలా ఇరవయ్యారేళ్ళు “విజయచిత్ర”కు కొండలరావు అంకితమైపోయారు. ఒక పత్రికలో ఇంతకాలం పని చేయడం ఒక రికార్డు. హైదరాబాదు వచ్చాక “హాసం” పక్ష పత్రికలో “హ్యూమరధం” పేరుతో పుంఖానుపుంఖలుగా వ్యాసాలు రాశారు. “నాగావళి నుంచి మంజీర వరకు” పేరుతో తన జీవిత అనుభవాలను పుస్తకంగా ప్రచురించారు. “మల్లీశ్వరి’, “మాయాబజార్” సినీ నవలలు ప్రచురించారు. “నాగయ్య ఆత్మకథ” కూడా కొండలరావు చలవే. అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారు ఈ ప్రతిభామూర్తికి “జీవితకాల సాధన” పురస్కారం అందించి గౌరవించారు. ప్రస్తుతం ఆరేళ్ళనుంచి ఈనాడు గ్రూపు వారి “సితార” పత్రికలో “పాతబంగారం” శీర్షికను కొండలరావు నిర్వహిస్తున్నారు. ప్రతివారం వస్తున్న ఈ శీర్షికకు మంచి స్పందన వుంది. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలికి “పద్మ” అవార్డులు దూరంగా ఉండడంలో ఆశ్చర్యమేముంది? రంగస్థలం పైనా, వెండితెర పైనా పువ్వులను కురిపించిన నవ్వుల పారిజాతం కొండలరావు. ఆయన పొగడ్తలకు అందని మహాజ్ఞాని. తాత్విక సమదర్శి.

 

– ఆచారం షణ్ముఖాచారి

Related posts