ఇటీవల ఉత్తర ఆస్ట్రేలియాలోని ఓ జాతీయ రహదారిపై అటవీ శాఖ అధికారులు మూడు కళ్ల పామును గుర్తించారు. ఈ అరుదైన సరీసృపానికి సంబంధించిన ఫొటోలను వారు విడుదల చేశారు. దీన్ని గుర్తించిన కొన్ని వారాలకే ఇది మృతి చెందిందని, దాన్ని ‘మాంటీ పైతాన్’ అని ముద్దుగా పిలుచుకున్నామని అధికారులు వివరించారు. దీన్ని వింతైన జీవిగా పేర్కొంటూ అక్కడి అటవీశాఖ అధికారులు తాజాగా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ పాముకి మూడో కన్ను తలపై భాగంలో ఉందని, ఇది సహజ సిద్ధంగానే పుట్టుకతోనే ఏర్పడిందని అటవీశాఖకు చెందిన వైద్య నిపుణులు మీడియాకు తెలిపారు.
ఈ పామును హంప్టీ డూ ప్రాంతంలో అటవీ సిబ్బంది గుర్తించి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సరీసృపం 40 సెంటీ మీటర్ల పొడవు ఉందని.. ఏదో శారీరక సమస్యతో బాధపడుతూ ఆహారం తీసుకోలేకపోయిందని వైద్యులు వివరించారు. ఈ పాముకి ఎక్స్‌రేలు తీసి పలు విషయాలను గుర్తించామన్నారు. రెండు తలలు అతుక్కుని ఏమీ పుట్టలేదని, సహజ సిద్ధంగానే దీనికి మూడో కన్ను ఉందని చెప్పారు. తాము ఇప్పటివరకు మూడు కళ్ల పాముని చూడలేదన్నారు.