చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముక కవి..ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు.
కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత కందికొండను వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఆయన ఆస్పత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సాయం చేశారు.
సినిమా పాటకు తెలంగాణ యాసను అద్దిన కవులలో కందికొండ ఒకరు. తెలంగాణ యాసలో పాటలు రాయడం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేశారు. హృదయాలను హత్తుకునేలా సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో పాటలు రాసిన కందికొండ.. చక్రి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు రాశారు. 20ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు.
ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది.
తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది.
దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్ ఇన్ లవ్’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.
కాగా..కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు