అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 22న శుక్రవారం ఉదయం విందు కార్యక్రమంతో తానా మహాసభలను అంగరంగ వైభవంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తానా మహా సభలను దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామని తానా అధ్యక్షుడు వేమన సతీశ్, మహాసభల కన్వీనర్ మూల్పూరి వెంకట్రావు తెలిపారు. అమెరికా నలుమూలల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి 12 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారని అంచనా. ఈ వేడుకలో వివిధ రంగాల్లో అద్భుతప్రతిభ కనబరిచిన ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేస్తారు. రెండోరోజు కాకినాడ శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద, విశ్వయోగి విశ్వంజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. 5, 6 తేదీల్లో వాణిజ్య, మహిళా, యువజన సదస్సులు నిర్వహిస్తారు. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన శ్రీకృష్ణరాయభారం నాటకాన్ని అమెరికాలో నివసిస్తున్న తెలుగు బాలబాలికలు ప్రదర్శిస్తారు. ఈ నాటకంలో పద్యాలు తెలుగులో, సంభాషణలు ఇంగ్లీష్ లో ఉండనున్నాయి. ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా బీజేపీ నేత రాంమాధవ్, సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గురువారమే అమెరికాకు చేరుకున్నారు. తానా అధ్యక్షుడు వేమన సతీశ్, ఇతర పాలకవర్గ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, జొన్నవిత్తుల, గాయని సునీత, రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పారిశ్రామికవేత్త ఎల్లా కృష్ణ, ప్రముఖ అవధాన పండితుడు మేడసాని మోహన్, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాసగౌడ్ హాజరవుతున్నారు. మహాసభల ప్రారంభం రోజున తమన్, చివరి రోజున కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీనటులు పూజా హెగ్డే, జగపతిబాబుఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నారు.
previous post
నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్