వైసీపీ లోక్‌సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్ జగన్ మొండిచేయి చూపించారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించారు. అక్కడి నుంచి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీలో అధికారికంగా చేరని మాగుంట శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించనున్నారు. శనివారమే పార్టీలో చేరినమోదుగుల వేణుగోపాలరెడ్డికి గుంటూరు, దాసరి జైరమేశ్‌కు విజయవాడ లోక్‌సభ స్థానాలు ఖరారు చేశారు.
దువ్వాడ శ్రీనివా్‌స(శ్రీకాకుళం),
బొత్స ఝాన్సీ (విజయనగరం),
ఎంవీవీ చౌదరి(విశాఖ),
వరుదు కల్యాణి(అనకాపల్లి),
గంజి అశోక్(కాకినాడ),
మార్గాని భరత్ (రాజమహేంద్రవరం),
చింతా అనూరాధ (అమలాపురం),
రఘురామకృష్ణంరాజు(నరసాపురం),
కోటగిరి శ్రీధర్(ఏలూరు),
బాలశౌరి(మచిలీపట్నం),
లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట),
పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(రాజంపేట),
వైఎస్ అవినాశ్‌రెడ్డి(కడప),
గోరంట్ల మాధవ్(హిందూపురం),
పి.డి.రంగయ్య(అనంతపురం),
బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
అధికారికంగా వీరి పేర్లు ప్రకటించకున్నా.. అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి.. కొత్తవారికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలు తమను కరివేపాకులా తీసేశారని గుర్రుగా ఉన్నారు. కాగా, ఒంగోలు ఎంపీగా, తనకు రాజకీయ సలహాదారుగా చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఈ దఫా ఎన్నికలకు దూరంగా ఉంచడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఒంగోలు సీటు తనకివ్వకపోవడంపై వీరిద్దరి మధ్య రగడ జరిగిందని.. అందుకే తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి సుబ్బారెడ్డి హాజరు కాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.