telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ లో .. .. భారీగా విస్తరిస్తున్న బంగ్లా తీవ్రవాదులు.. : ఎన్‌ఐఏ

terrorist camps increasing in india

జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ‘జమాత్‌-ఉల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ)’ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని హెచ్చరించింది. ఆ సంస్థతో సంబంధాలు నెరుపుతున్న అనుమానితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసినట్టు వెల్లడించింది. ఉగ్రవాద వ్యతిరేక దళాల (ఏటీఎస్‌) సదస్సులో ఎన్‌ఐఏ సారథి వైసీ మోదీ మాట్లాడారు. 2007లో పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన జేఎంబీ కార్యకలాపాలు ప్రస్తుతం అసోం, ఝార్ఖండ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకూ విస్తరించాయన్నారు. ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అలోక్‌ మిత్తల్‌ మాట్లాడుతూ, దేశంలో మొత్తం 130 మంది సానుభూతిపరులు జేఎంబీ నాయకత్వంతో సంబంధాలు నెరుపుతున్నారు. 2014-18 మధ్య ఆ సంస్థ బెంగళూరులో దాదాపు 22 రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. కర్ణాటక సరిహద్దుల్లోని క్రిష్ణగిరి హిల్స్‌లో రాకెట్‌ లాంఛర్లకూ ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. జమ్ము-కశ్మీర్‌ బ్యాంకు కనీస వివరాలు, హామీలు, రికార్డులు లేకుండా రుణాలను మంజూరు చేయడం అనుమానం కలిగిస్తోంది.

ఇలా పొందిన సొమ్మును కొందరు ముష్కరులు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినట్టు అనుమానం కలుగుతోందని మిత్తల్ అన్నారు. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ తన కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. ఉగ్రవాద కేసులను సాధారణ క్రిమినల్‌ కేసుల తరహాలోనే న్యాయవ్యవస్థ పరిగణిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుండటంతో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణ భద్రతా సంస్థలకు క్లిష్టతరంగా మారిందన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ కీలక అంశంగా మార్చుకోవడం మన భద్రతా సంస్థలకు పెనుసవాలుగా తయారయిందన్నారు.

Related posts