తెలంగాణలోని సూర్యాపేటలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను చివ్వెంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్ వద్ద వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.