telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ ఉత్తర్వులు జారీ..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఉద్యోగుల డీఏ 10.01 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులై 1 నాటికి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ కూడా ఉద్యోగులు అందుకోనున్నారు. 2021 జూలై నుంచి ఉన్న బకాయిలను ప్రభుత్వం.. జీపీఎఫ్‌లో జమ చేయనుంది.

కరోనా కారణంగా రెండేళ్లుగా డీఏ చెల్లింపులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడటంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.

సీపీఎస్ వర్తించే ఉద్యోగులకు బకాయిల్లో పది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమచేస్తారు. మిగతా 90 శాతాన్ని జూన్ నుంచి మూడు విడతల్లో చెల్లిస్తారు. విశ్రాంత ఉద్యోగులకు కూడా పెరిగిన డీఏ ఫిబ్రవరిలో అందుతుంది. బకాయిలను మే నుంచి ఆరు విడతల్లో చెల్లిస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

కాగాప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts