telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

తెలంగాణ : కౌండిన్యపురం.. కేంద్రీయ మ్యూజియం .. చూశారా..

kowndinyapuram musium details

దేశంలో ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర, స్థల విశేషం, పురాణమూ ఉంటుంది. చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనిషి కొత్త ఉత్సాహం పొందుతారు. చారిత్రక స్థలాలు సందర్శించడం ప్రత్యేక అనుభూమితిని కలిగిస్తుంది. పురాతన వస్తువులు, స్థలాలు చారిత్రక సంఘటనలు లోలోపలి పురస్మృతులను మురిపిస్తాయి. చరిత్ర తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. అలాంటిదే తెలంగాణలోనే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. సంగారెడ్డి జిల్లా చారిత్రక స్థలాల్లో తెలుసుకోవాల్సిన ప్రాంతం కొండాపూర్. శాతవాహనుల తొలికాపు చరిత్రకు సాక్షం కొండాపూర్. దీనికి దక్షిణ తోషీలా అనే పేరు కూడా ఉంది. లభిస్తున్న చారిత్రిక ఆధారం మేరకు తొలి తెలుగు రాజు ముఖ్య పట్టణం కూడా ఇదే అని కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దలు కొందరు చెబుతుంటారు. మొగస్తనీస్ పేర్కొన్న 30 తెలుగు నగరాల్లో కొండాపూర్ ఒకటి. నలమహారాజు భార్య దమయంతి, శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీదేవిలు కూడా జన్మించిన స్థలం కూడా ఈ కౌండిన్య నగరమే కొండాపూర్ అని చెప్పుకుంటారు.

కొండాపూర్, ఆనాటి నగర జీవనానికి వర్తక కేంద్రమే. రోమన్ వర్తక సంబంధాలు ఉన్నట్లు ఇక్కడ దొరికిన నాణేలు తెలుపుతున్నాయి. మట్టి వస్తువులు, గాజు వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, గృహ పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఆభరణాలు, నాణేలు, పెద్దపెద్ద మట్టిగోళాలు, ఇటుకలు, పూసలు, ఇనుప వస్తువులు, గొడ్డళ్లు అప్పటి క్రీస్తు పూర్వం -200, క్రీస్తు శకం 200ల మధ్య కాలానికి సంబంధించిన వస్తువులు అమర్చి చారిత్రక సంపదను కొండాపూర్ మ్యూజియంలో భద్రపరిచారు. క్రీస్తు శకం 1900ల సంవత్సరంలో హేన్రీ కౌజెన్స్ అనే పురావస్తు శాస్త్రవేత్త మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనిపెట్టారు. నూతన శిలాయుగపు మానవుడు ఉపయోగించిన రాతి పనిముట్లు 5వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ జనజీవనం ఉన్నట్టు తెలిపే ఆధారాలు కొండాపూర్‌లో కొలువై ఉన్నాయి. నాలుగు దశాబ్దాల శాతవాహనుల పాలనను ప్రతిబింబించే ఆధారాలు కూడా ఇక్కడ కొలువుదీరాయి.

సుమారు 100 ఎకరాల ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఎత్తైన కొండపై ఒక పురావస్తు కార్యాలయాన్ని నిర్మించి అందులో వివిధ రకాల వస్తువులను భద్రపరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మ్యూజియాన్ని ఎవరూ కూడా పట్టించుకునే వారు లేరు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మ్యూజియానికి అన్ని రకాల సదుపాయాలను అందించి నేడు పురావస్తుశాఖ ప్రదర్శనశాల కొండాపూర్ పేరును తెలంగాణ వ్యాప్తంగా గుర్తు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎత్తైన కొండలపై పచ్చని పైరుల మధ్య మ్యూజియాన్ని అప్పటి పురావస్తుశాఖ అధికారులు అంగరంగ వైభవంగా నిర్మించారు. పెద్దని హాలు, రెండు నుంచి నాలుగు వరకు చిన్న చిన్న గదులతో తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువులను గ్లాసుల్లో జాగ్రత్తగా అమర్చారు.

సుమారు 35 నుంచి 45 సంవత్సరాలకు ముందు మ్యూజియం వరకు ఆర్టీసీ బస్సు కేవలం కొండాపూర్ వరకు మాత్రమే వచ్చేదని పూర్వీకులు చెప్పేవారని కొండాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తెలిపారు. ప్రతి శుక్రవారం మ్యూజియానికి సెలవు దినం మినహా ప్రతిరోజు పనిదినాలుగానే కొనసాగుతుంది. మ్యూజియం ముందు పచ్చని రకరకాల చెట్లతో చల్లని పైరు గాలులతో ఈ ప్రదేశాన్ని తిలకించడానికి వచ్చిన వారికి ఎంతో హాయిగా ఉంటుందని కొంతమంది పర్యాటకులు తమ అంతరంగాన్ని వెలిబుచ్చుకున్నారు. మ్యూజియంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు సీసీ కెమెరాలతో కొండాపూర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సంబంధితశాఖ కార్యాలయ ఆవరణలో ఎప్పటికప్పడు తిలకిస్తారు. 15 సంవత్సరాల లోపు చిన్నారులకు ప్రవేశ రుసుము ఉచితంగానే ఉంటుంది. ఆ వయస్సు నుంచి మినహాయించిన వారికి రూ.5 మాత్రమే ప్రవేశ రుసుము ఉంటుంది.

Related posts