telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఘటన : ఎన్‌కౌంటర్‌పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు

Tehseen Poonawalla

దిశ కేసులో తాజాగా పోలీస్ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇలా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ పై షాకింగ్ కామెంట్ చేశారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రియాంక గాంధీ మరిది టెహసీన్ పూనావాలా. ఎన్‌కౌంటర్లు కేవలం పేద ప్రజలకేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు గుప్పించారు.

“దిశను అత్యాచారం చేసిన నలుగురు నిందితులు పెద్ద తప్పు చేశారు. వారిని ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చంపి తెలంగాణ పోలీసులు మరో తప్పు చేశారు. తప్పుకి తప్పుతో సమాధానం చెబితే అది ఒప్పైపోదు. మనం నెమ్మదిగా ప్రభుత్వ వైఫల్యానికి అలవాటు పడిపోతున్నాం. ప్రభుత్వం ఇలాంటి ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. ఆశారాం బాపు, ఉన్నావ్ రేప్ నిందితుడు సెంగార్, చిన్మయానంద్‌లకు కూడా ఇదే గతి పడుతందా? లేకపోతే ఈ ఎన్‌కౌంటర్లు పేద ప్రజలకు మాత్రమేనా? పార్లమెంట్‌లో ఎంపీలు నిందితులపై దాడి చేసి చంపాలని అన్నారు. వ్యవస్థను మార్చి, సరైన విచారణతో త్వరగా న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చట్టం లేని దేశం వైపు అడుగులేస్తున్నాం. రీకంస్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లాం అని తెలంగాణ పోలీసులు అన్నారు. ఏదైనా కేసులో నిందితులను ఘటనాస్థలికి రీకంస్ట్రక్షన్ చేయాలనుకుంటే వీడియోను రికార్డ్ చేస్తారు? ఆ వీడియో ఏది? ఎన్‌కౌంటర్లను లీగల్ చేస్తే మన న్యాయవ్యవస్థ పూర్తిగా పడిపోతుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రవర్తించకూడదు. ఈ ఫేక్ ఎన్‌కౌంటర్‌ని అందరూ ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కథువా రేప్ కేసులోని నిందితులను కూడా ఇలాగే ఎన్‌కౌంటర్ చేయాలని అనుకుంటున్నారు. కథువా కేసులో నిందితుడు అని భావించిన విశాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ విచారణలో అతను రేప్ చేయలేదు అని తేలింది. దాంతో అతన్ని వదిలేశారు. ఒకవేళ పోలీసులు అక్కడికక్కడే ఎన్‌కౌంటర్ చేసుంటే ఓ అమాయకుడు చనిపోయి ఉండేవాడు కదా..

నలుగురు నిందితులు ఆయుధాలు లాక్కున్నారా?
నలుగురూ పారిపోవడానికి యత్నించారా?
వారి కాళ్లపై చేతులపై ఎందుకు బుల్లెట్లు తగల్లేదు?
వాళ్లు తుపాకీలు పట్టుకుని పారిపోబోయారు అన్నారు. మరి తుపాకీలు పోలీసుల యూనిఫాంలో లేవా?
వీరికి అసలు తుపాకీ ట్రిగ్గర్ ఆన్ చేసి ఎలా కాల్చాలో తెలుసా?

మీకు గుర్తుందో లేదో గుడ్‌గావ్‌లో ఓ బాలుడిని హత్య చేశాడని స్కూల్ బస్సు కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేయలేదని తేలింది. పోలీసులు అతన్ని కూడా ఎన్‌కౌంటర్ చేసుంటే ఏం జరిగేదో ఆలోచించండి. మనం న్యాయాన్ని, చట్టాన్ని మర్చిపోయి అంధకారంలోకి పడిపోతే ఏదో ఒక రోజు అదే మనల్ని వెంటాడుతుంది” అన్నారు.

Related posts