ఏపీ పోలీస్ శాఖలో 37 మంది డీఎస్పీల పదోన్నతులపై వైసీపీ చేసిన విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూరేలా ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు సైతం లేఖలు రాశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలపై టీడీపీ ఘాటుగా స్పందించింది.
పోలీసు పదోన్నతులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. సర్వీసు నిబంధనలపై కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం పదోన్నతుల్లో 17 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న విషయం ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.