telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వర్షాలతో ఏర్పడిన పరిస్థితుల పై కేటీఆర్ సమీక్ష…కీలక ఆదేశాలు ఇవే

ktr telangana

హైదరాబాద్ తో  పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు
సమీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పలుచోట్ల ఇంకా నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సహాయక చర్యలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని మంత్రికి సీఎస్ సోమేష్ కుమార్ తెలియజేసారు. ప్రభుత్వం నగర ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆ దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నీళ్లు వెళ్లిపోయిన కాలనీలు,  ఇళ్లలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాలనీల్లో జీహెచ్ఎంసి సెంటర్లలో 104 వాహనాల ద్వారా తక్షణం వైద్య సహాయం అందించాలని ఇందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
వరద ప్రభావం నుంచి బయటకు వచ్చిన ప్రజలు, తాగునీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నిన్నటి నుంచి నగర వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశామని తెలిపిన అధికారులు… ఈ రోజు కూడా ప్రజలకి అక్షయపాత్ర సహాయంతో 5 రూపాయల భోజనం మరియు ఉచిత ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో వరద ప్రభావం అంచనా వేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసి కలిసి పనిచేయాలని మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి తో జరిగే సమావేశ సమయానికి అన్ని వివరాలతో కూడిన నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. పాతభవనాలు, అపార్టుమెంట్ సెల్లార్లు, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నీటిని   తొలగించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. చెరువుల వద్ద ముందస్తు చర్యలకు సాగునీటి శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వర్షాలవల్ల ఎదురైన పరిస్థితుల పైన సమీక్షించేందుకు వీలుగా CDMA పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి ఒక నివేదిక సమర్పించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts