telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ బాబు ఎప్పుడూ ఏదో కెలుకుతూ ఉంటారుగా…. : మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi

‘తెలుగు సినీ రచయితల సంఘం’ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆదివారం హైదరాబాద్‌లో రజతోత్సవాన్ని నిర్వహించారు. జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు ఆదివిష్ణు, రావి కొండలరావు, కోదండరామిరెడ్డి, భువనచంద్రను చిరంజీవి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సింగీతం శ్రీనివాసరావు, కె. విశ్వనాథ్‌గారు ఇక్కడికి వచ్చి ఉంటే పరిపూర్ణంగా ఉండేది. భవిష్యత్తులో వారికి నాతో జీవిత సాఫల్య పురస్కారాలు అందించే అవకాశం ఇస్తే సంతోషిస్తా’’ అన్నారు. చిత్రసీమలో దర్శక, నిర్మాతల తర్వాత నేను అత్యంత గౌరవించేది రచయితలనే! వాళ్లతో సన్నిహితంగా ఉంటాను. రచయితలు లేకపోతే మేము (నటీనటులం) లేమన్నది వాస్తవం! అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన రచయితలను సన్మానించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభకు నన్ను పిలకపోయి ఉంటే బాధపడేవాణ్ణి. నా జీవితంలో మరువలేని ఘట్టమిది.” అని చిరంజీవి అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “ఇక్కడకు రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను అత్యధికంగా గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. మొన్నీమధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం. అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చో పెట్టారు. దూరం నుంచి చూస్తున్న నాకు.. కరెక్టేకదా, ఆ స్థానాన్ని అలంకరించే అర్హుడు ఆయనేకదా అనిపించింది. అది ఒక్క సత్యానంద్‌నే కాదు రచయితలందరినీ గౌరవించినట్టు అని నేను ఫీలయ్యాను. అందరం ఆయన దగ్గరకు వెళ్లి ఒక ఫొటో దిగాం. సత్యానంద్‌గారిని కాలుమీద కాలేసుకోమని చెప్పాం. ఆయన స్వభావం కాకపోయినా మేం చెప్పామని వేసుకున్నారు. ఆ సమయంలో మోహన్ బాబు.. ఎప్పుడూ ఏదో గెలుకుతూ ఉంటాడు కదా ఆయన. ఏమయ్యా.. రాఘవేంద్రరావును నిలబెట్టి, సత్యానంద్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. దర్శకేంద్రుడయ్యా.. ఆయన్ని అవమానిస్తావా అన్నారు. నేను వెంటనే.. రాఘవేంద్రరావు అమరశిల్పి జక్కన్న. ఉలి, సుత్తి ఆయన చేతిలో ఉంటుంది. ఆయన దేన్ని చెక్కాలి.. ఒక శిల ఉండాలి కదా.. ఆ శిలేనయ్యా సత్యానంద్ గారు అన్నారు. సత్యానంద్ మనసులో నుంచి వచ్చిన కథను రాఘవేంద్రరావు అందంగా చెక్కుతారు. ఆ రకంగా ఆయన దిట్ట. రాఘవేంద్రరావును తక్కువ చేయటం కాదయ్యా.. సత్యానంద్ లాంటి రచయితలను గౌరవించుకోకపోతే మనకు మనుగడ లేదు అని గుర్తుచేస్తున్నాను అని అన్నాను. ఇదంతా ఆ సాయంకాలం సరదాగా జరిగింది’’ అని నవ్వుతూ చెప్పారు చిరంజీవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘నాకు వేషాలు ఇవ్వమని వెంటపడిన సత్యానంద్‌ని సన్మానించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రచయితలు సరస్వతీ పుత్రులు. వాళ్లను గౌరవించడం అతికొద్ది మందికే తెలుసు. ఎన్నో సిల్వర్‌ జూబ్లీ చిత్రాలు ఇచ్చిన ఆరుద్రగారు మరణిస్తే… ఆయన్ను చూడటానికి ఏ నిర్మాత వెళ్లలేదు. నా శ్రీమతి, కుమార్తె వెళ్లి మాల వేసి వచ్చారు. నా నిర్మాణ సంస్థలో ఎంతోమంది గొప్ప రచయితలు పని చేశారు. వాళ్ల ఆశీస్సులు మాకు కావాలి.

కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. రచయితలందరూ దర్శకులయ్యారు. ఇప్పుడందరూ రచయితలను నమ్ముకోవాలి. దర్శకుడు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అయితే… కథ, మాటలు రాసే రచయిత షిప్‌. నిర్మాత దాని ఓనర్‌. షిప్‌కు పెట్టే పేర్లు హీరోలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రయాణికులు. జనమే సమ్రుదం. వాళ్లు ఆదరిస్తే ఒడ్డున చేరతాం. లేదంటే మునుగుతాం’’ అన్నారు. ఈ వేడుకలో ప్రతిభ, విశిష్ఠ రచన, గౌరవ పురస్కారాలను రమణాచారి, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు అందజేశారు. ‘తెలుగు సినీ రచయితల సంఘం’ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు, బలభద్రపాతుని రమణి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Related posts