telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒక్క ఉద్యోగి చేసిన టిక్ టాక్ కారణంగా కంపెనీనే మూతపడింది…

ఓ కార్మికుడు టిక్‌టాక్‌ వీడియో మోజులో పడి తనతో పాటు తనకు ఉద్యోగం ఇచ్చి కూడు పెడుతున్న కంపెనీని కూడా వీధుల్లోకి తీసుకువచ్చాడు. పాల డైరీలో పని చేసే అతడి వెధవ పనికి ఏకంగా డైరీ కంపెనీనే మూతపడింది. టర్కీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోన్యాలోని సెంట్రల్‌ అనాటోలియన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఎంమ్రీ సయర్‌ అక్కడి ఓ పాల డైరీలో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం టిక్‌ టాక్‌ వీడియో కోసం తాను పని చేస్తున్న పాల డైరీలోని పాల టబ్బులోకి దిగి స్నానం చేశాడు. అయితే అనుకున్నట్టే ఆ టిక్‌ టాక్‌ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ దెబ్బకు ఎంమ్రీతో పాటు వీడియో తీసిన వ్యక్తిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతే కాదు ఈ డైరీ కంపెనీని మూసి వేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోన్యా అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యల కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Related posts