telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ -ప్లీనరీ వేదికగా ప్రకటన..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది.

ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు నియామకాల నిబంధనల్లో కీలక మార్పులు చేయబోతున్నారు. ఎల్లుండి వైసీపీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. ఈసందర్భంగా ఎల్లుండి తీర్మానంలో పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక అధ్యక్ష ఎన్నిక లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ తీర్మానం కూడా చేయనున్నారు.

12 సంవత్సరాలుగా జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. తొలిసారిగా 2011లో వైసీపీ ప్లీనరీ జరిగింది. తర్వాత 2017లో ప్లీనరీని నిర్వహించారు. మరోవైపు రేపు దాదాపు 1.50 లక్షల మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది..

ఇక, జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. సీఎం జగన్ రేపు ఉదయం పులివెందులలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు వైసీపీ ప్లీనరీ సమావేశాలకు హాజరవుతారు. సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీలో 9 తీర్మానాలు ప్రవేశపెట్టి.. వాటికి ఆమోదం తెలుపనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. తొలి రోజున ప్రతినిధులతో సభను నిర్వహించనున్నారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. జూలై 9వ తేదీన సీఎం జగన్ ముగింపు ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి

Related posts