telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 వేలంలో ఆర్‌సీబీ టార్గెట్ వీళ్ళే…

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌‌ లక్ష్యంగా ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఫిబ్రవరి‌లో ఐపీఎల్ 2021 సీజన్ వేలం జరగనుండగా.. అత్యధికంగా 10 మంది క్రికెటర్లను వేలంలోకి వదిలేసిన కోహ్లీసేన .. రూ.35.7 కోట్లతో మినీ ఆక్షన్‌కు సిద్దమవుతోంది. తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునేందుకు మిచెల్ స్టార్క్‌ కోసం అవసరమైతే రూ. 15 నుంచి 19 కోట్లు వెచ్చించేందుకు కూడా ఆర్‌సీబీ వెనుకాడబోదని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ‘ఆర్‌సీబీకి ఇప్పుడు మొత్తం 11 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. అయితే.. ఆ టీమ్ తుది జట్టులో ఇప్పటికే ఏబీ డివిలియర్స్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్ రూపంలో నాలుగు ఓవర్‌సీస్ స్లాట్స్ భర్తీ అయ్యాయి. కనుక ఆర్‌సీబీ విదేశీ క్రికెటర్లను ఎక్కువ మందిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ మిచెల్ స్టార్క్ వేలంలో ఉంటే..? అతని కోసం ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ చివరి వరకూ పోరాడుతుంది. అవసరమైతే స్టార్క్ కోసం వేలంలో రూ.15-19 కోట్లు వెచ్చించేందుకు కూడా ఆ ఫ్రాంఛైజీ సిద్ధమవుతోంది” అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

ఇక మిడిలార్డర్ బలహీనతను అధిగమించేందుకు ఆ జట్టు ఆసీస్ యువ క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ను కూడా తీసుకునే అవకాశం ఉందని ఈ టీమిండియా మాజీ ఓపెనర్ తెలిపాడు. ఇప్పటికే ఆరోన్ ఫించ్‌ను వదులుకున్న ఆ జట్టు అతని స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్, జాసన్ రాయ్‌లలో ఒకరిని దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చన్నాడు. ‘ఆర్‌సీబీ మిడిలార్డర్ బలహీనంగా ఉన్నందును ఆ సమస్యను అధిగమించేందుకు ఆ ఫ్రాంచైజీ కామెరూన్ గ్రీన్‌ను తీసుకునే ప్రయత్నం చేయవచ్చని నాకనిపిస్తుంది. అలాగే ఆరోన్ ఫించ్‌ను వదులుకోవడంతో ఓపెనర్ స్లాట్ కూడా ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేందుకు డేవిడ్ మలన్, జాసన్ రాయ్‌లల్లో ఒకరిని తీసుకునే అవకాశం కూడా ఉంది’అని చోప్రా చెప్పుకొచ్చాడు.

Related posts