వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు అనంతపురంలో మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపైతీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులను ఆపాలని హెచ్చరించారు.
రాజీనామా చేయాలని అంగన్‌వాడీ టీచర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ఆగడాలను తూర్పారబట్టారు. కాంట్రాక్టర్లు, కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారని ప్రశ్నించారు. దాడులు చేయడం తప్పు అన్న వాళ్లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.