ఏపీలో నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వేసిన ఓటు సాంకేతిక కారణాలతో చెల్లని ఓటుగా గుర్తించారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని తెలిపారు. అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.