కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రానున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త గురువారం తమిళనాడులో హల్చల్ చేసింది. విజయ్ తన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నాడని మీడియా కోడై కూసింది. అయితే ఆ వార్తను ఖండిస్తూ కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ పీఆర్వో, ఈవెంట్ మేనేజర్ రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రెస్ నోట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు. తన తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని విజయ్ చెప్పినట్లుగా ఆ ప్రెస్ నోట్లో విజయ్ పేర్కొన్నాడు. తనకు ఆ రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని, తన తండ్రి స్థాపించబోతున్న పార్టీ అన్న ఉద్దేశంతో అభిమానులెవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరాడు. ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పార్టీ ముసుగులో తన పేరుగానీ, ఫోటోగానీ వాడుకుంటే కఠినచర్యలు తీసుకోవాల్సి వస్తుందని విజయ్ స్వయంగా చెప్పినట్లు ఆ ప్రెస్‌నోట్‌లో ఉండటం కొసమెరుపు. ఈ ఘటన అటు కోలీవుడ్‌లోనూ, తమిళ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.