telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సింగ్ ఆత్మహత్య సిబిఐకి… అమిత్ షా మద్దతు

Sushanth singh rajput

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్‌ను కుదిపేసింది. హిందీ పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు సుశాంత్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించారు. సుమారు 30 మందిని విచారించి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. వీరిలో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంట్లో పనిచేసిన వాళ్లు, ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, పబ్లిసిస్ట్ రోహిణి అయ్యర్, యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్ షణూ శర్మ, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, సినిమా, టీవీ పరిశ్రమలకు చెందిన కొంత మంది సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా మద్దతు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బిహార్ ఎంపీ పప్పు యాదవ్ రాసిన లేఖను సంబంధిత శాఖకు హోం మంత్రి అమిత్ షా ఫార్వార్డ్ చేశారు. ఈ విషయాన్ని పప్పు యాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు అమిత్ షా సంతకం చేసిన లేఖను ట్వీట్‌లో పొందుపరిచారు. ‘‘అమిత్ షా గారు, మీరు తలుచుకుంటే సుశాంత్ కేసుకు సంబంధించి ఒక్క నిమిషంలో సీబీఐ విచారణ జరుగుతుంది. దీన్ని ఆపొద్దు! బీహార్‌కు చెందిన గౌరవ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గారి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ కోసం కేంద్ర హోం మంత్రిని లేఖ ద్వారా కోరాను. దీనిపై స్పందించి లేఖను ఆయన ఫార్వార్డ్ చేశారు’’ అని పప్పు యాదవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సుశాంత్ అకాల మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని రోజు క్రితం టీవీ, సినీ నటుడు శేఖర్ సుమన్ ఒక ఫోరమ్‌ను ప్రారంభించారు. సుశాంత్ న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్న వారి వెంట నిలబడని బాలీవుడ్ ప్రముఖులపై కూడా శేఖర్ విరుచుకు పడ్డారు.

Related posts