telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇప్పటికే మొహాలకు మాస్క్‌లు… రేపు వీపున ఆక్సిజన్ సిలిండర్లు… దర్శకుడు సంపత్ నంది కామెంట్స్

Sampath-Nandi

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది… రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సంపత్ నంది.. తన భార్య, పిల్లలతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సంతోష్ అన్న ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో నేనూ ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నన్ను నామినేట్ చేసినందుకు భాను గారికి థ్యాంక్స్. పద్మశ్రీ కోటి మొక్కల రామయ్య గారి గురించి మొదటిసారి విన్నప్పుడు.. ఒక మనిషి అన్ని మొక్కలు ఎలా నాటగలిగారని ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తరవాత మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మక్క గారు హైవే వెంట నాలుగు కిలోమీటర్ల పాటు మొక్కలు నాటారని తెలిసి ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ సంతోష్ అన్న ఇప్పటికే మూడు కోట్ల మొక్కలకు దగ్గరవుతున్నారు. తప్పకుండా వారికి మించిన గౌరవం సంతోష్ అన్నకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, సినిమా వాళ్లకు నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే.. ఇప్పటికే మనందరం మొహాలకు మాస్క్‌లు వేసుకుని తిరుగుతున్నాం. ఈ పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడుకోలేకపోతే రేపు వీపున ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాల్సి వస్తుంది. అందుకని మొక్కని నాటుదాం.. గ్రీన్ ఇండియాను చాటుదాం’’ అని అన్నారు.

ఈ సందర్భంగా అందరి మాదిరిగానే తాను కూడా ముగ్గురు సెలబ్రిటీలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ‘ఖుషి’, ‘ఒక్కడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భూమిక, తన బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా, తన ‘సీటీమార్’ సినిమా హీరోయిన్ దిగంగనా సూర్యవంశీలను సంపత్ నంది నామినేట్ చేశారు. కాగా ప్రస్తుతం సంపత్ నంది ‘సీటీమార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related posts