బ్యానర్ : నిర్వాణ సినిమాస్
నటీనటులు : నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లిన్ బెసానియా, సుహాసిని, శివాజీ రాజా
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాతలు: వై. సందీప్, వై. సృజన, రామ్ నరేష్
చాలా కాలంగా మెగా హీరోయిన్ నిహారిక మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ నిహారికను హిట్ మాత్రం వరించలేదు. తాజాగా నిహారిక నటించిన “సూర్యకాంతం” సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా మెగా హీరోకు హిట్ ఇచ్చేనా ? ప్రేక్షకులను నిహారిక ఎంత మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ :
సూర్యకాంతం (నిహారిక) అందరితో సరదాగా ఉండే గడుసమ్మాయి. ఎవరినీ తొందరగా నమ్మదు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే సూర్యకాంతంను తల్లి (సుహాసిని) పెళ్ళి చేసుకోమని పోరు పెడుతుంది. దీంతో నిహారిక పెళ్లిని తప్పించుకుంటూ తిరుగుతుంది. అలాంటి సూర్యకాంతంను చూసి ఇష్టపడతాడు అభి (రాహుల్). తన ప్రేమ విషయాన్నీ సూర్యకాంతంతో చెబుతాడు అభి. కానీ మరుసటి రోజు నుంచి సూర్యకాంతం మాయమవుతుంది. అభి ఆమె కోసం ఏడాది ఎదురు చూస్తాడు. కానీ ఇంకా సూర్యకాంతం తిరిగి రాకపోవడంతో ఇంట్లో చూసిన అమ్మాయి పూజ (పెర్లిన్)ని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అభి. మరికొన్ని రోజుల్లో నిశ్చితార్థం ఉంది అనగా ప్రత్యక్షమవుతుంది సూర్యకాంతం. ఆమెకు అభిపై ఉన్న ప్రేమను అతనికి తెలియజేస్తుంది. అప్పుడు అభి ఏం చేశాడు ? సూర్యకాంతం ఇన్ని రోజులు అసలు ఎక్కడికి వెళ్ళింది ? అభి ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ? చివరికి ఏం జరిగింది ? కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? అనేది వెండి తెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
నిహారిక ప్రథమార్థంలో సరదాగా, కొంటెగా కన్పించి, ద్వితీయార్థంలో కొంత భావోద్వేగాన్ని పండించడానికి ప్రయత్నించింది. అయితే ఇంతకు ముందు సినిమాల కన్నా ఈ సినిమాలో నిహారిక నటన మెరుగైనట్లు కన్పిస్తుంది. రెండవ హీరోయిన్ పెర్లిన్ పూజ పాత్రలో బాగానే ఒదిగిపోయింది. ఇక ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా అభి పాత్రతో రాహుల్ మెప్పిస్తాడు. సూర్యకాంతం తల్లిగా సుహాసిని, కథానాయకుడి తల్లిదండ్రులుగా శివాజీరాజా, మధుమణి తమ నటనతో ఆకట్టుకున్నారు. సత్య తదితరులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు… అవసరమైనప్పుడు విడిపోవడం కూడా అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కొత్త కథ కాకపోయినా ముక్కోణపు ప్రేమ కథతో నవతరం యువత ఆలోచనలకు సరిపోయేట్లుగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఒక అబ్బాయి జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తే ఏం జరుగుతుందో చూపించాడు. అక్కడక్కడా సున్నితమైన హాస్యాన్ని టచ్ చేశాడు. అయితే నిహారిక చేసే హంగామా కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. కథనాన్ని బలంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కథ ముగించిన విధానం బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా లేదు. మార్క్ కె రాబిన్ సంగీతం, నేపథ్య సంగీతం ఫర్వాలేదన్పించాయి. హరి జాస్తి కెమెరా పనితనం మెప్పిస్తుంది. రాజ్ నిహార్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5
ఆ నర్స్ ను బాగా వాడేసి వదిలేశావ్… గుర్తుందా ?… తేజపై శ్రీరెడ్డిపై తేజ సంచలన ఆరోపణలు