telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీం ఝలక్

ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. సాగు చట్టాలను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టింది. సమస్య పరిష్కారం అయ్యేవరకు చట్టాలను నిలుపుదల చేయాలని సూచించింది. లేదంటే తామే స్టే విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు చనిపోతుంటే కనిపించడం లేదా అని కేంద్రాన్ని నిలదీసింది. వృద్ధులు, మహిళలుకూడా పోరాటం చేస్తున్నారని గుర్తు చేసింది. ఇప్పటికే పరిస్థితి విషమించిందని.. రక్తపాతం జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడిచినా పరిష్కారం చూపకపోవడమేంటని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై అటార్నీ జనరల్‌ స్పందింస్తూ.. చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సుప్రీం కోర్టు గతంలో చట్టాలు నిలుపుదల చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావిస్తే.. తప్ప స్టే విధించలేరని కోర్టుకు చెప్పారు. ఈ నెల 15న చర్చలు ఉన్నందున… అప్పటి వరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. 

Related posts