telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాసాల‌మ‌ర్రి మొత్తం నా కుటుంబ‌మే : సీఎం కేసీఆర్

ఇవాళ్టి నుంచి వాసాల‌మ‌ర్రి మొత్తం త‌న కుటుంబ‌మే అని సీఎం కేసీఆర్ అన్నారు. కుల‌మతాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ్రామ‌స్తులంతా 2 గంట‌లు ప‌ని చేస్తే అభివృద్ధి త‌ప్ప‌కుండా సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. వాసాల‌మ‌ర్రికి బ్ర‌హ్మాండ‌మైన క‌మ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్ల‌ను బాగు చేసుకుందాం. ఎవ‌రికి ఏం అవ‌స‌ర‌మున్నా మంజూరు చేసే బాధ్య‌త నాది. ఊర్లోని మూడు ద‌ళితవాడ‌ల‌కు వెళ్లి వాళ్ల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాను అని చెప్పారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో గ్రామ నిధి ఏర్పాటు చేసుకుని, క‌ష్ట‌మొచ్చిన వారికి అండ‌గా నిలిచే అవ‌కాశం ఉంటుంది. వాసాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌త్యేక అధికారిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున నియ‌మిస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌త్యేక అధికారి ఎవ‌రో కాదు.. జిల్లా క‌లెక్ట‌రే అని.. త‌ల్లైనా, తండ్రైనా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తినే. గ్రామ అభివృద్ధికి నూరో, నూట యాభై కోట్లు ఇస్తాం. కానీ ఆ నిధులు వినియోగించాలి. అప్పుడే అభివృద్ధి జ‌రిగిన‌ట్టు. గ్రామంలో జ‌బ్బు ప‌డిన వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున ఉచితంగా వైద్యం అందిస్తామ‌న్నారు. గ్రామంలో అర్హులైన వారంద‌రికీ రేష‌న్ కార్డులు ఇస్తామ‌న్నారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ముఖ్య‌మంత్రి నిధి నుంచి ప్ర‌తి గ్రామ పంచాయ‌తీకి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాను. జిల్లాలోని భువ‌న‌గిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగ‌తా ఐదు మున్సిపాలిటీల‌కు రూ. 50 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో గ్రామ అభివృద్ధి క‌మిటీలు ఏర్పాటు చేయాలి. వాసాల‌మ‌ర్రికి కూడా వంద గ్రామాల ప్ర‌జ‌లు వ‌చ్చి అభివృద్ధి నేర్చుకోని పోవాల‌న్నారు. ఈ గంట నుంచి కులం లేదు, మ‌తం లేదు, జాతి లేదు. మ‌నంద‌రిది ఒకటే కులం. మ‌న‌ది అభివృద్ధి కులం, బాగుప‌డే కులం అని సీఎం కేసీఆర్ అన్నారు.

Related posts