telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సొంత ఇంటిని దానం చేసిన గాన గంధర్వుడు…!

SPB

ప్రముఖ నేపథ్య గాయకుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న తన సొంత గృహాన్ని కంచి పీఠానికి వేద పాఠశాల నిర్వహణకు ఎస్పీబీ అందజేశారు. మంగళవారం రాత్రి ఆ ఇంట్లోనే జరిగిన కార్యక్రమంలో గాన గాంధర్వుడు స్వయంగా కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి గృహాన్ని లాంఛనంగా సమర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరిట ఈ పాఠశాలను నిర్వహించనున్నారు. తన ఇంటిని కంచి పీఠానికి అందజేసిన సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మా తండ్రిగారు పెద్ద శైవభక్తులు. గురుభక్తితో ఉండే వారు. వారులేరనే అసంతృప్తి తప్ప వారిపేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు’’ అని అన్నారు.

కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి మాట్లాడుతూ.. ‘‘భిక్షాటన పూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన ఘనత ఎస్పీ సాంబమూర్తికే దక్కుతుంది. నెల్లూరు వీధుల్లో భగవన్నామ సంకీర్తనను మారుమోగించిన ప్రతిభాశాలి సాంబమూర్తి. దేశంలో వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, సంగీత, సాహిత్యాలను పరిరక్షించుకునే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. సంగీతం, భక్తి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సాంబమూర్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలంలో వేదనాద ప్రచారాన్ని కొనసాగిస్తాం’’ అని చెప్పారు.

Related posts