ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గత కొంతకాలంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తన క్రికెట్ భవిష్యత్తు నిర్ణయం వచ్చే ఏడాది ఉండవచ్చనే సంకేతాలిచ్చాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్ టీ20 తర్వాతే తన కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. వరల్డ్ టీ20 ముగిసిన తర్వాత ఒక స్పష్టత రావచ్చు. ఆ తర్వాత నేను గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉండవచ్చని మోర్గాన్ పేర్కొన్నాడు. వరల్డ్ టీ20కి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడమే తన లక్ష్యమని మోర్గాన్ తెలిపాడు.
న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, జాసన్ రాయ్‌లకు విశ్రాంతి ఇవ్వడంపై మోర్గాన్ క్లారిటీ ఇచ్చాడు. వారిని పక్కకు పెట్టడం అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కానప‍్పటికీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం సాధ్యమైనంత వరకూ పటిష్టంగా ఉన్న జట్టునే ఎంపిక చేశామనే అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.