telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

సాఫ్ట్ వేర్ .. ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు… : టీసీఎస్ గ్లోబల్ హెడ్ రాజన్న.వి

software future for next 6 years

మరో ఐదారేళ్ళ ఐటీ రంగానికి ఢోకాలేదంటున్నారు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ గ్లోబల్ హెడ్ రాజన్న.వి. కొత్త ఏడాదిలోనే కాదు.. కనీసం వచ్చే అయిదారేళ్లపాటు దేశీయ సాఫ్ట్‌వేర్‌ రంగం కళకళలాడే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి డిజిటల్‌ టెక్నాలజీలు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), కృత్రిమ మేధ (ఏఐ), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చ్యువల్‌ రియాలిటీ (వీఆర్‌) వంటి టెక్నాలజీలు ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని, ఈ టెక్నాలజీలను నేర్చుకున్న వారికి ఢోకా ఉండదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) గ్లోబల్‌ హెడ్‌ (టెక్నాలజీ బిజినెస్‌ యూనిట్‌), ప్రాంతీయ అధిపతి (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) వి.రాజన్న చెబుతున్నారు. ఖాతాదారులను కంపెనీలు ఆకట్టుకోవాలంటే భిన్నమైన రీతిలో సేవలందించాలి. డిజిటల్‌ టెక్నాలజీల ద్వారానే అది సాధ్యమైనందున ఈ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఐటీ పరిశ్రమ వృద్ధికి ఈ పరిణామం దోహదం చేయగలదన్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఐటీ రంగంలో రానున్న ధోరణులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా లభించే ఉద్యోగావకాశాలు, పరిశ్రమ ఆదాయంలో పెరుగుదల మొదలైన అంశాలపై ఒక మీడియా తో చర్చించారు.

అందులోని ముఖ్యంశాలు..భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ వృద్ధికి డిజిటల్‌ టెక్నాలజీలే దోహదం ఏ విధంగా అంటే, పోటీని అధిగమించి అన్ని రంగాల్లోని కంపెనీలు ఆటోమోషన్‌, క్లౌడ్‌ సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీల ద్వారానే ఆటోమేషన్‌ జరుగుతుంది. ఇప్పటి వరకూ కంపెనీలు చిన్న, చిన్న మొత్తాల్లోనే డిజిటల్‌ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాయి. వచ్చే కొద్ది సంవత్సరాల్లో కంపెనీలు (ఖాతాదారులు) డిజిటల్‌ టెక్నాలజీల్లో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే వీలుంది. బిలియన్‌ డాలర్లకు మించిన ప్రాజెక్టులను మెగా డీల్స్‌ అంటారు. ఇటువంటివి భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు బాగా వచ్చే వీలుంది. 2018-19 లో ఇటువంటి ప్రాజెక్టులు టీసీఎస్ కు మూడు, నాలుగు వచ్చాయి. దేశీయ ఐటీ పరిశ్రమ, కంపెనీలకు ఇది సానుకూల పరిణామం. వచ్చే అయిదారేళ్లు పరిశ్రమ అభివృద్ధికి డిజిటల్‌ టెక్నాలజీలు దోహదం చేయనున్నాయి.

అవకాశాలను అందిపుచ్చుకునే సామర్ధ్యాలు దేశీయ ఐటీ పరిశ్రమకు..ఎంతవరకు అంటే.. ప్రపంచ ఖాతాదారులకు (కంపెనీలు) భారత్‌ డిజిటల్‌ టెక్నాలజీల హబ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీల్లోకి మారే ప్రక్రియలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేసే సామర్థ్యాలు మన కంపెనీలకు పటిష్ఠంగా ఉన్నాయి. దేశీయ ఐటీ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాల కోసం ఎక్స్‌లెన్స్‌ కేంద్రాల్లో (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నిపుణులకు డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలను పెంచడంపైన కూడా ఎక్కువ నిధు లు కేటాయిస్తున్నాయి. టీసీఎ్‌సనే తీసుకుంటే.. స్వల్ప కాలంలో 3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్‌ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చింది. అన్నింటికీ మించి ఖాతాదారులను అర్థం చేసుకోవడంలో భారత కంపెనీలదీ అందెవేసిన చేయి. కొన్ని సంవత్సరాలుగా వారితో అనుబంధమే ఇందుకు కారణం.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా పరిశ్రమలో .. ఐటీ రంగంలో ప్రస్తుతం 42 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా లక్ష మందికి ఐటీ పరిశ్రమ ఉపాధి అవకాశాలు కల్పించింది. 2018-19, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అదనంగా ఇదే స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. 2019-20 నియామకాల కోసం ఇప్పటికే టీసీఎస్‌ మొదటి విడత ప్రాంగణ, ఆఫ్‌ క్యాంపస్‌ నియామాలను పూర్తి చేసింది. రెండో విడత ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలను ప్రారంభించాం. విద్యార్థులు, నిపుణులు కొత్త టెక్నాలజీలలో నైపుణ్యాలు సంపాదించి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7 శాతం వాటా ఐటీ పరిశ్రమదే. మొత్తం ఎగుమతుల్లో 24 శాతం, సేవల రంగ ఎగుమతుల్లో 40 శాతానికి మించి ఐటీ ఎగుమతులే ఉన్నాయి. దేశంలో అత్యధిక ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఐటీ ఒకటి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ ఆదాయం…అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2017-18లో ఐటీ పరిశ్రమ ఆదాయం 8 శాతానికి పైగా వృద్ధి చెంది 167 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.11.52 లక్షల కోట్లు) చేరింది. ఇందులో 126 బిలియన్‌ డాలర్లు (75 శాతం) ఎగుమతులు కాగా.. 25 శాతం దేశీయ వాటా. 2018-19లో పరిశ్రమ ఆదాయం 7-10 శాతం మేరకు పెరగడానికి అవకాశాలున్నాయి. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ టెక్నాలజీల వల్ల లభించే ఆదాయం వాటా పెరిగే వీలుంది. టీసీఎ్‌సనే తీసుకుంటే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం దాదాపు 12 శాతం పెరిగింది. అయితే.. డిజిటల్‌ టెక్నాలజీల ద్వారా లభించిన ఆదాయం ఏకంగా 60 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ టెక్నాలజీల వాటా మూడో వంతు ఉంది.

అన్ని రంగాల్లోని కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీలకు ఎందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయంటే…సినిమా టికెట్ల కొనుగోలు నుంచి షాసింగ్‌ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఖాతాదారులకు భిన్నమైన అనుభవాన్ని కల్పించి ఆకర్షించాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. వినియోగదారులకు అదనపు విలువ చేకూర్చాలని భావిస్తున్నాయి. ఐటీ కంపెనీల కోణంలో చూస్తే మరింత మెరుగైన సేవలను తక్కువ ఖర్చుకు ఐటీ కంపెనీలు అందించాలని ఖాతాదారులు కోరుకుంటున్నారు. అందుకే డిజిటల్‌ టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. టీసీఎస్‌ అభివృద్ధి చేసిన ‘బిజినెస్‌ 4.0 థాట్‌ లీడర్‌’ వ్యూహం పరిశ్రమ మొత్తానికి వర్తిస్తుంది. ఖాతాదారు కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీల్లోకి మారే ప్రక్రియలో ఎలా పాలుపంచుకోవాలన్న దానిపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగస్వాములతో చేతులు కలుపుతున్నాయి. ఉదాహరణకు ఒక డిజిటల్‌ ప్రాజెక్టును అమలు చేయాలంటే.. నెట్‌వర్కింగ్‌ కంపెనీ, చిప్‌సెట్‌ తయారీ కంపెనీ మొదలైన రంగాల్లోని కంపెనీల అవసరం ఉంటుంది.

హైదరాబాద్‌లో టీసీఎస్‌ విస్తరణ ప్రణాళికల విషయానికి వస్తే, ఆదిభట్లలో అభివృద్ధి చేసిన ప్రాంగణంలో మొత్తం నాలుగు అభివృద్ధి కేంద్రాలను (డెవలప్‌మెంట్‌ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే రెండు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 13,000 మంది నిపుణులు పని చేస్తున్నారు. ఆదిభట్ల ప్రాంగణ సామర్థ్యం 25,000 మంది. మూడో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నిర్మాణంలో ఉంది. 3-4 నెలల్లో పూర్తవుతుంది. నిపుణుల అవసరాలను బట్టి నాలుగో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తుంది. టీసీఎస్ కు హైదరాబాద్‌ ఎంతో కీలకం. ఇక్కడ వివిధ విభాగాలకు సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేయగల నిపుణుల లభ్యత, మౌలిక సదుపాయాలు వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో టీసీఎస్కు మొత్తం మూడు- డెక్కన్‌ పార్క్‌, సినర్జీ పార్క్‌, ఆదిభట్ల ప్రాంగణాలున్నాయి. 2007లో హైదరాబాద్‌లో టీసీఎస్ కు 4,500 మంది ఉద్యోగులుంటే.. ఇప్పుడు 43,000 మంది నిపుణులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. దశాబ్ద కాలంలో నిపుణుల సంఖ్య పదింతలైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ కు హైదరాబాద్‌ నాలుగో అతిపెద్ద కేంద్రం. టీసీఎస్‌ వృద్ధి వ్యూహంలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్‌ కేంద్రం కీలకంగా కొనసాగుతుంది. ఇటీవలే విజయవాడలో కూడా టీసీఎస్‌ ఆన్‌లైన్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. టీసీఎ్‌సలో మొత్తం 4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Related posts