telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా

Rhea

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన కుటుంబం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి కె.కె.సింగ్ ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద మంగళవారం పాట్నా పోలీసులు రియాపై కేసు నమోదు చేశారు. రియాను విచారించేందుకు పాట్నా పోలీసులు ముంబైకి వెళ్లారు. అయితే, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రియా లాయర్ సతీష్ మనేషిండే సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. కాగా, పాట్నాలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ‘‘రియా చక్రవర్తిపై రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేకే సింగ్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, శృతి మోదీ, శోవిక్ చక్రవర్తి, మరికొంత మందిపై ఐపీసీ సెక్షన్లు 341, 342, 380, 406, 420, 306, 120 (బి) కింద కేసులు నమోదయ్యాయి. రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని సుశాంత్ తండ్రి కోరారు. రియా తన స్వార్థం కోసం సుశాంత్‌ను తన ఫ్యామిలీకి పూర్తిగా దూరం చేసిందని ఆయన ఆరోపించారు. సుశాంత్ బ్యాంక్ ఖాతాను కూడా ఆమెనే ఆపరేట్ చేస్తోందని చెప్పారు. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి కొన్ని కోట్ల రూపాయలు విత్‌డ్రా అయ్యాయని ఇప్పటికే గుర్తించాం’’ అని సంజయ్ కుమార్ సింగ్ చెప్పారు. సుశాంత్ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు జూన్ 8న రియా గుర్తించిందని.. ఆ తరవాత డబ్బు, ఆభరణాలు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డ్, దాని పిన్ నంబర్, పాస్‌వర్డ్, ముఖ్యమైన పత్రాలు, డాక్టర్లు ఇచ్చిన రిసిప్ట్‌లు తీసుకొని వెళ్లిపోయిందని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూర్ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికి ఆయన వయసు 34 సంవత్సరాలు. ఈ కేసులో ఇప్పటికే ముంబైలో పోలీసులు 40 మందిని విచారించారు. వీరిలో రియా చక్రవర్తి కూడా ఉన్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే రియా కోరారు.

Related posts