telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

శరన్నవరాత్రులు : .. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా .. అమ్మ .. జమ్మిచెట్టును పూజ..

sarannavaratrulu today sri rajarajeswaridevi

నేడు పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనమివనున్నారు. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని మనకందరికీ అందింపచేసే అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. చెరకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదింపచేసే రూపంతో శ్రీ షోడాశాక్షరీ మహా మంత్రస్వరూపిణీగా శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా రాజరాజేశ్వరీదేవి వెలుగొందుతున్నారు. ఈ దేవిని అర్చించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. విజయాలు సమకూరును. విజయదశమినాడు శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజించడం, పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇంతకీ జమ్మిచెట్టు ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టుపై దాచి, అజ్ఞాతవా సం పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను ధరించారు. అనంతరం శమీవృక్ష రూపాన ఉన్న ‘అపరాజిత’దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయ భేరీ మోగించారు. అంతకన్నా ముందు శ్రీ రాముడు కూడా రావణునిపై దండెత్తే ముందు, అనంతరం విజయదశమినాడు విజయం సాధించిన అనంతరం తన నగరానికి బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

నేటి సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన జమ్మి చెట్టు వద్ద గల అపరాజితా దేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం’ అనే శ్లోకాన్ని చదువుకుంటూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని రాసిన చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. తెలంగాణాలో శమీ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇళ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే ఐక్యతా రాగానికి ప్రతీకగా భావిస్తారు.

Related posts