ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. ఇప్పటికే హిందీ చిత్రసీమలో సత్తాచాటింది. సినిమాపై విమర్శలు గుప్పించిన వారందరికీ కలెక్షన్లతోనే సమాధానం చెబుతోంది. భారత్‌లోనే కాదు యూఎస్‌లోనూ “సాహో” కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శనివారం సాయంత్రానికి “సాహో” యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు (రూ.21 కోట్లపైగా) కొల్లగొట్టింది. ఇప్పటి వరకు బాహుబలి: ద బిగినింగ్, బాహుబలి: ద కంక్లూజన్, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు మాత్రమే 3 మిలియన్ క్లబ్బులో ఉన్నాయి. దీంతో నార్త్ అమెరికాలో ఈ ఫీట్ సాధించిన ఐదో చిత్రంగా “సాహో” నిలిచింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ “సాహో” చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతుండటం పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.