telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హుజూరాబాద్ ప్రజల చేతిలో తెలంగాణ ప్రజల భవిష్యత్: రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని రావిర్యాలలో ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ జరిగింది. వర్షంలో తడుస్తూనే రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఉన్నారని, కేసీఆర్‌ను మరో 18 నెలల్లో గద్దె దించాలనే ఆవేశంతో ఉన్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని, దళిత బంధు అంటూ దళితులను కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్లు అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ వీడి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను దెబ్బకొట్టే అవకాశం ఇప్పుడు ప్రజలకు దక్కిందని, దాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని.. వారికి స్వేచ్ఛను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా.. వారి కుటుంబంలోని వారికి మాత్రమే ఉద్యోగాలువచ్చాయని అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు బాగుపడలేదని అన్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని అన్నారు. ప్రజల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం తెలంగాణను వాడుకుంటోందని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసింది ఎవరో.. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల చేతిలో ఉందని ఆలోచించి ఓట్లు వేయాలని రేవంత్ కోరారు.

Related posts