telugu navyamedia
క్రైమ్ వార్తలు

పూడిమడక తీరంలో విషాదం..గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్‌

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో విషాదం చోటు చేసుకుంది.. గల్లైంతనవారిలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే..

అనకాపల్లి డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఓ రాకాసి అల వచ్చి పడింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే నలుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు. ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు, మత్స్యకారులు గాలింపు చేపట్టారు . దీంతో మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ అనే వ్యక్తిని మత్స్యకారులు రక్షించారు. తేజను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

మిగిలిన ఆరుగురి కోసం పోలీసులు, అగ్నిమాపక దళం, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది చీకటి పడేవరకు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం అమవాస్య కావడంతో శుక్రవారం సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు తెలిపారు. చీకటి పడటంతో నిన్న సహాయక చర్యలను నిలిపివేశారు. శనివారం తెల్లవారుజామున తిరిగి సహాయక చర్యలను ప్రారంభించారు.

అయితే ఇప్పటి వరకు గల్లంతు అయిన వారిలో పవన్ సూర్య కుమార్, గణేష్, జగదీషన్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. జశ్వంత్, రామచందు, సతీష్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు

Related posts