telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త సంవత్సరంలో రామానాయుడు, దాసరి ప్రత్యేకత

Bhageeradha

నూతన సంవత్సరం అనగానే తెలుగు సినిమా రంగంలో ఆ ఇద్దరూ స్మృతి పథంలో మెదులుతారు. అనంతంగా, అజేయంగా కాలం సాగుతూనే ఉంటుంది. 1931 నుంచి తెలుగు సినిమా టాకీ అభివృద్ధిలో ఎందరో మహనీయులు విశేషమైన కృషి చేశారు. తెలుగు సినిమా ప్రభావానికి, వైభవానికి బాటలు వేశారు. ఎందరో మహానుభావులు తెలుగు సినిమా వెలుగు చరిత్రకు కృషి చేసి… భౌతికంగా దూరమైనా… వారి చిత్రాల ద్వారా మన మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే వుంటారు. అలాంటి వారిలో పద్మభూషణ్ డి.రామానాయుడు గారు, దర్శకరత్న దాసరి నారాయణ రావు… ఈ కొత్త సంవత్సరంలో ఆ మహనీయ వ్యక్తులను గుర్తు చేసుకుందాం. కొత్త సంవత్సరం రోజున చాలా మంది సినిమా వారితో పాటు నేను కూడా వారిద్దరినీ తప్పనిసరిగా కలుస్తూ వుండేవాడిని. ఆ ఇద్దరూ లేని లోటు ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

రామానాయుడు గారిని కొత్త సంవత్సరం రోజున ఆయనతో అనుబంధం వున్న అందరూ కలసి శుభాకాంక్షలు చెప్పి వారి ఆశీస్సులు తీసుకునేవారు. ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి స్టూడియోస్ కు వచ్చిన ప్రతి వారికీ వంద రూపాయల నోటు ఇచ్చేవారు. నాయుడుగారి దగ్గర నుంచి ఆ వంద నోటును తీసుకోడానికే చాలామంది వచ్చేవారు. అది చాలామందికి నూతన సంవత్సరం రోజున సెంటిమెంట్. ఆ నోటును చాలామంది అపురూపంగా దాచుకునేవారు. అలాగే ఆయన జన్మించిన జూన్ 6న కూడా ఆత్మీయులు రామానాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లేవారు.

Bhageeradha

నాయుడుగారు చనిపోయిన తరువాత ఆ స్టూడియో వైపు చాలామంది వెళ్లడం లేదు. నాయుడు గారు లేక స్టూడియోలోని ఆయన ఆఫీస్ చాలా కాంతిహీనంగా కనిపిస్తుంది. పద్మభూషణ్ రామానాయుడు గారు సినిమా రంగానికి ఎప్పటికీ ప్రాతఃకాల స్మరణీయులు.

ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు గారిని నూతన సంవత్సరం రోజున కలసి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి వారికీ ఆయన నూట ఒక్క రూపాయి ఇచ్చి ఆశీర్వదించేవారు. దాసరినిగారిని ఆయన శిష్యులతో పాటు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, జర్నలిస్టులు తప్పని సరిగా కలిసేవారు. కొత్త సంవత్సరం రోజున తన దగ్గరకు వచ్చిన అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన శ్రీమతి శ్రీమతి పద్మ గారు అందరికీ కాఫీలు పంపిస్తూ ఉండేవారు. దాసరి నారాయణ రావు గారి ఇల్లు కొత్త సంవత్సరం రోజున కళకళలాడుతూ పండుగ వాతావరణంలా ఉండేది. అలాగే దాసరి నారాయణ రావు గారి పుట్టిన రోజు మే 4న కూడా దాసరిగారి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతూ ఉండేది. సినిమా రంగంలో అందరూ ఉదయం వేళ ఆ ఇంటికి వచ్చేవారు. మధ్యాన్నం వేళ అందరికీ ఆ దంపతులు ఇద్దరూ విందు భోజనం పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవారు.

Dasari

ఇప్పుడు దాసరి నారాయణ రావుగారు, పద్మగారు భౌతికంగా దూరమైన తరువాత ఆ ఇంటి వైపు వెళ్లే సినిమావారు లేరు.
ఆ ఇల్లు ఇప్పుడు దాసరి గారి గతకాల స్మృతులు గుర్తుకు తెస్తూ వుంది. 

దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమాకు వెలుగు రేక .. ఓ …వేగు చుక్క . ఇప్పుడు ఆయన లేని లోటు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమాలో తనదైన ముద్రవేశారు.

రామానాయుడు గారు జూన్ 6, 1936న జన్మించారు. 18 ఫిబ్రవరి 2015న తన 78వ ఏట ఇహలోక యాత్ర ముగించారు.

దాసరి నారాయణరావు గారు మే 4, 1947న జన్మించారు. 70వ ఏట 30 మే 2017న భౌతికంగా మనకు దూరమయ్యారు.

– భగీరథ

Related posts