telugu navyamedia
సినిమా వార్తలు

గురువు దాసరి స్పూర్తితో ఎదిగిన కోడి రామకృష్ణ

Kodi Ramakrishna2

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు కన్నుమూశారనే వార్త తెలుగు సినిమా రంగాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.
తన గురువు దాసరి నారాయణ తరువాత ఎక్కువ విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ నిరాడంబరుడు, నిగర్వి.
రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. దాసరి నారాయణ రావు గారిది కూడా పాలకొల్లే. రామకృష్ణ చదువుకునే రోజుల నుంచే నాటకాలు డైరెక్ట్ చేస్తూ, నటిస్తూ ఉండేవాడు.

Kodi Ramakrishna3

చదువు పూర్తి అయిపోయిన తరువాత మద్రాస్ వెళ్లి దాసరి నారాయణ రావు గారి దగ్గర సహాయకుడిగా చేరాడు.
రామకృష్ణ లో సినిమా పట్ల అభిమామే కాకుండా, అవగాహన కూడా ఉందని, నటి నటులకు డైలాగు చెప్పడం, అవసరం అయితే నటించి చూపడం చేసేవాడు. అవ్వన్నీ దాసరి గ్రహించాడు. అందుకే రామకృష్ణను ప్రోత్సహించడం మొదలు పెట్టాడు . రామకృష్ణ చాలా త్వరగా దర్శకత్వంలోని మెళుకువలు నేర్చుకున్నాడు.
దాసరి ఒకరోజున రామ కృష్ణను నువ్వు స్వంతంగా దర్శకత్వం చేసుకో అని ఆశీర్వదించాడు.
అది 1981వ సంవత్సరం. రామకృష్ణ బాగా ఆలోచించి హైదరాబాద్ వచ్చి నిర్మాత కె. రాఘవను కలిచాడు. దాసరి నారాయణ రావు కు మొదట అవకాశం ఇచ్చింది రాఘవే. “తాతా మనవడు “సినిమా. ఈ 1972లో వచ్చింది. కోడి రామకృష్ణ. అందుకే మొదటి సినిమా రాఘవ గారిది అయితే తన సినిమా జీవితం బాగుంటుందని అనుకున్నాడు.
అయితే రాఘవ మొండి ఘటం. ఒక పట్టాన ఎవరికీ అర్ధం కాడు, వెంటనే అవకాశం ఇవ్వడు.
అయితే దాసరి శిష్యుడు కాబట్టి, అలాగే ముందు కథ చూసుకో, ఆ తరువాత చూద్దాం అన్నాడు.

Kodi Ramakrishna
అప్పుడు నిర్మాత రాఘవ హైద్రాబాద్లోని నాగార్జున నగర్ కాలనీలో ఉండేవాడు. రామకృష్ణ ప్రతి రోజు ఉదయమే నడుచుకుంటూ రాఘవ గారి ఇంటికి వెళ్లి కనిపిస్తూ ఉండేవాడు. అలా తరువాత గొల్లపూడి మారుతి రావు మంచి కథ ఇచ్చాడు. రామకృష్ణ ఆ కథను రాఘవకు వినిపించాడు. దానికి రాఘవ వెంటనే ఒకే అనలేదు. చాలాకాలం కథ మీద కూర్చొని మార్పులు చేర్పులు చేసిన తరువాత అప్పుడు రాఘవ సినిమా మొదలు పెడదాము చెప్పాడు.
అదే 1982లో వచ్చిన “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య “. ఇందులో చిరంజీవి, మాధవి తో పాటు గొల్లపూడిని కూడా ఓ ముఖ్య పాత్రలో పరిచయం చేశారు.  
ఈ సినిమా ఘన విజయం సాధించింది. రెండవ సినిమా తరంగిణి కూడా రాఘవే నిర్మించాడు. ఇందులో సుమన్ హీరో.  
ఆ తరువాత కోడి రామకృష్ణ తిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాలు ఘానా విజయం సాధించాయి. ఆ తరువాత హీరోగా కూడా రామకృష్ణ నటించాడు .
దాసరి నారాయణ రావు శ్రీమతి పేరు పద్మ. కోడి రామ కృష్ణ కూడా తన సహా నటిని ఇష్టపడ్డాడు. దాసరి పద్మ దగ్గరుండి వివాహం జరిపించారు.
ఆమె పేరు కూడా పద్మ కావడం యాదృచ్చికం.
కోడి రామ కృష్ణ ,శ్యామ్ ప్రసాద్ తో కలసి అంకుశం, ఆహుతి, తలంబ్రాలు సినిమాలు చేసేటప్పుడు రుమాలు తలకు చుట్టుకోవడం అలవాటు అయ్యింది.
ఆ సినిమా విజయం సాధించడంతో రుమాలు చుట్టుకోవడం సెంటిమెంటుగా మారిపోయింది.
దర్శకుడు గా సెట్ మీదకు వచ్చాడంటే తలకు రుమాలు చుట్టాల్చిందే. కోడిరామకృష్ణ ఎస్. గోపాలరెడ్డి, బాలకృష్ణ కాంబినేషన్లో విజయవంతమైన సినిమాలు చేశారు. ఎప్పుడు నవ్వుతూ షూటింగ్ చేయడం రామకృష్ణకు ఇష్టం. తక్కువ బడ్జెట్ లో చేయడం, తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయడంలో రామకృష్ణకు మంచి పేరుంది. కోడి రాకకృష్ణ కు ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఫిలిం నగర్లో నివాసం ఉంటున్నాడు.

Kodi Ramakrishna4
రామకృష్ణ ఆఖరి సినిమా “శ్రీసత్యసాయిబాబా “. ఈ సినిమాకు కరాటం రాంబాబు నిర్మాత. 80 శాతం సినిమా పూర్తి అయ్యింది.
గత కొన్నాళ్ల క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. అయినా తేరుకున్నాడు. నిన్న శ్వాస సంబంధమైన సమస్య రావడంతో ఆసుపత్రికి వెళ్ళాడు.
ఈరోజు తుది శ్వాస విడిచాడు. చిన్న స్థాయి నుంచి అనూహ్యమైన స్థాయికి ఎదిగిన రామకృష్ణ దర్శకుడుగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

– భగీరథ

Related posts