తాజా ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. అటు బౌలర్లు ఇటు బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను మట్టికరిపించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అజింక్యా రహానె(39; 34 బంతుల్లో 4×4, 1×6), లివింగ్‌స్టన్(44; 26 బంతుల్లో 4×4, 3×6) ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాక లివింగ్‌స్టన్ ఔటయ్యాడు. కాసేపటికే రహానె కూడా పెవిలియన్ చేరడంతో సంజుశాంసన్(48; 32 బంతుల్లో 4×4, 1×6), స్టీవ్‌స్మిత్(22; 16 బంతుల్లో 3×4) నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. 17వ ఓవర్‌లో స్మిత్ ఔటైనా అప్పటికే రాజస్థాన్ విజయం ఖరారైంది. చివర్లో శాంసన్, ఆష్టన్ టర్నర్(3) లాంఛనాన్ని పూర్తి చేసి రాజస్థాన్‌కు ఐదో విజయాన్ని అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ అల్‌హసన్, రషీద్‌ఖాన్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మనీశ్‌పాండే(61; 36 బంతుల్లో 9×4) అర్ధశతకంతో మెరిశాడు. డేవిడ్ వార్నర్(37; 32 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. దీంతో 12 ఓవర్లకు 103/1తో పటిష్ఠస్థితిలో ఉన్న జట్టు 200 స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే వార్నర్ ఔటయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఆఖరి ఓవర్‌లో రషీద్‌ఖాన్(17; 8 బంతుల్లో 1×4, 1×6) ధాటిగా ఆడి రాజస్థాన్‌కు 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. రాజస్థాన్ బౌలర్లు వరున్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్ తలో రెండు వికెట్లు తీశారు.
నేటి మ్యాచ్ లు : ఢిల్లీ vs బెంగుళూరు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. కలకత్తా vs ముంబై రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.