telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసియా కప్ వాయిదా… ఏకంగా రెండేళ్లు

ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌ అర్ధాంతరంగా వాయిదా పడింది. తాజాగా ఆసియా కప్ 2021 కూడా పోస్ట్ పోన్ అయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.ఈ టోర్నమెంట్‌ను 2023కు వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఆసియా కప్‌ది కూడా వాయిదా పద్ధతే కావడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే అర్హత గల ఆరు దేశాలు పాల్గొనే మెగా టోర్నమెంట్ ఇది. భారత్.. దాని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తలపడే హైఓల్టేజ్ టోర్నీగా క్రికెట్ ప్రేమికులు దీన్ని గుర్తిస్తుంటారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ టోర్నీకంటే దీనికి ఉన్న డిమాండ్ ఎక్కువ. నిజానికి- ఈ టోర్నమెంట్ ఈ ఏడాది శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధాంతరంగా రద్దయిన ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయాల్సి ఉండటం, ఈ ఏడాది చివరిలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహించబోతోండటం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దీనికి తోడు కావడం, అదే సమయంలో టీమిండియా ఇంగ్లాండ్‌లో రెండున్నర నెలల పాటు సుదీర్ఘ పర్యటించాల్సి ఉండటం వంటి టైట్ షెడ్యూల్ వల్ల ఆసియా కప్ 2021ను 2023కు వాయిదా వేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. 2018 తరువాత ఇప్పటిదాకా ఆసియాకప్ టోర్నమెంట్ ఏర్పాటు కాలేదు. ఆ ఏడాదిలో భారత్ ఛాంపియన్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.

Related posts