ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రక విజయం సాధించగానే ఎన్నో ప్రశంసలు, మరెన్నో పొగడ్తలు వస్తున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారా ఇలా ప్రతీ రంగానికి చెందినవారు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. కానీ వారందరికీ కష్టాల్లోనూ, ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడినప్పుడు ఓ వ్యక్తి మాత్రం వెన్నంటే ఉన్నారు. ఆయనే ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణాలను తయారు చేస్తున్న ఆయన.. ఇప్పటికీ తెరవెనుకే ఉంటూ ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిస్తున్నారు.
బ్రిస్బేన్ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే.. దానికి కారణం కూడా ద్రవిడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే రాటుదేలారు. అండర్-19, భారత్-ఏ కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్.. ఈ యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలిస్తూ మార్గనిర్దేశనం చేశాడు.
అతనికి కష్టానికి దక్కిన ఫలితమే ఈ గబ్బా విజయం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరూ అభిమానులు ట్విటర్ వేదికగా రాహుల్ ద్రవిడ్‌కు తమదైన శైలిలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ‘ఆట నుంచి రిటైరైన తర్వాత కూడా సేవలందిస్తున్న ద్రవిడ్‌కు ఇవే మా సెల్యూట్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కమిన్స్ కావొచ్చు.. కానీ మా దృష్టిలో మాత్రం రాహుల్ ద్రవిడే రియల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్.. ఇంతమంది యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేసిన ద్రవిడ్ అసలైన హీరో..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ద్రవిడ్‌కు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.