కల్లాకపటం లేని
కల్మషమసలే అంటని
ఆత్మీయతానురాగాల పొదరిల్లు
నా పల్లె
పచ్చని పంటపొలాలు
ముచ్చటగొలిపే బంధుత్వాలు
అచ్చమైన ఆనందాల హరివిల్లు
నా పల్లె
కచ్చకాయలూ అష్టాచెమ్మ
పచ్చీసు పులిజూదం
తొక్కుడు బిళ్లల ఆటస్థలం
నా పల్లె
అన్నదమ్ముల కయ్యాలకు
ఆలుమగల జగడాలకు
‘కోర్టు’గా మారిన కచీరు
నా పల్లె
మల్లన్న దుబ్బలో
హన్మాండ్ల గుడికాడ
ఆటలాడించిన జారుడుబండ
నా పల్లె
వేకువజామున ‘కొక్కొరొకో’ అంటూ
అలారంతో అందర్నీ మేల్కొలిపే
గంప కింది కోడి పుంజు
నా పల్లె
వేసవి సెలవుల్లో
అడుగంటిన మడుగుల్లో
గాలం ఎరకు పడ్డ బుడ్డవర్క
నా పల్లె
ఈతపండ్లు,మొర్రిపండ్లు
తునికిపండ్లు,రేగుపండ్లు
సీతాఫలముల మాధుర్యం
నా పల్లె
లక్షల జనమంతా
లక్షణంగా హాజరయ్యే
మేడారం జాతరలోని బెల్లం ముద్ద
నా పల్లె
సాధనాసురులు,గంగిరెద్దులాటలు
హరికథలూ బుర్రకథలు
చిందు బాగోతాల వేదిక
నా పల్లె
ఎనుగు దాటి చేన్లలో పడి
పంటనంతా పాడుజేసే
దొంగ గొడ్ల మెడలోని లొటారం
నా పల్లె
సభలున్నా సమావేశాలున్నా
పంచాయతి పనులున్నా
డప్పు కొట్టి తెలిపేటీ దండోరా
నా పల్లె
నిండైన ఈతవనం
మోకు ముత్తాదులతో తాటిచెట్లు
గ’మ్మత్తైన’ పోద్దాటి కల్లు
నా పల్లె
వానకాలం వరదలతో
చెరువు నిండి పోయినపుడు
అలుగు దుంకి పారేటి మత్తడి
నా పల్లె