telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిజానికి ఒకటే ముఖం.. అబద్ధానికి అనేకం!

నిజానికి ఒకటే ముఖం..
అబద్ధానికి అనేకం!
సత్యం స్వరం.. సుస్వరం!
అసత్యం.. అపస్వరభరితం!
నీవు వద్దనుకున్నా.. నిజం..
నిన్ను వెదుక్కుంటూ వస్తుంది!
అబద్ధాన్ని అందలం ఎక్కించినా….
అడ్డంగా ముంచి పోతుంది!
నిజం.. కష్టం లేకుండా..
నీ నాలుకపై వాలుతుంది !
అబద్ధాన్ని మాత్రం….
అర్ధించవలసి వస్తుంది!
సత్యాన్ని సాకనక్కర్లేదు….
మరచి ..వదిలేసినా….
మనవెంటే ఉంటుంది !
అసత్యాన్ని అలక్ష్యం చేస్తే….
కొంపముంచి పోతుంది!
నిజాన్ని కాపాడనక్కర్లేదు..
నిన్ను కాపాడుతూ ఉంటుంది!
అబద్ధానికి రక్షణ లేకపోతే మాత్రం..
ఆగంచేసి తీరుతుంది!
నేడు చెప్పినా….
నిన్న చెప్పినా….
మొన్న చెప్పినా ….
ఎప్పుడు చెప్పినా….
నిజం చెప్పటం..
నల్లేరుపై నడవటం!
ఎప్పుడు చెప్పినా….
అబద్ధం చెప్పటం..
అంతస్తులు నడిచి ఎక్కటం!
అందుకే….
నిజాన్ని నిర్భయంగా చెప్పేద్దాం!
అబద్ధాన్ని ఆవలికి నెట్టేద్దాం!

Related posts