అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి గురించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి.
” ఈ దశాబ్ధంలో వ్యాపార రంగం చాలా కీలకమైంది. ఈ రంగంలో భారత్, అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి” అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు. బైడెన్‌తో భేటీ వల్ల అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం లభించిందన్నారు ప్రధాని మోడీ. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే బైడెన్‌తో మాట్లాడాననీ.. భారత్ పట్ల అప్పుడే ఆయన దృక్పథం అర్ధమైందనీ చెప్పారు.
అంతకు ముందు తాను భారత ప్రధానమంత్రి చర్చలు జరపబోతున్నానని, ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని జో బైడెన్ అన్నారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. పలురంగాల్లో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు బైడెన్ వెల్లడించారు.
ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా లాంటి దేశానికి ఎప్పుడో శాశ్వత సభ్యత్వం రావాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని అందరూ ఒప్పుకుంటారు. కానీ, శాశ్వత సభ్యత్వం దక్కడానికి కావాల్సిన చొరవ మాత్రం ఎవరూ తీసుకోవడం లేదు. వీలైనంత త్వరగా భద్రతా మండలిలో సంస్కరణలకు చొరవ తీసుకోవాలని మోడీ.. బైడెన్ ను కోరినట్టు సమాచారం.. ఎన్నో ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించడంలో భారత్-అమెరికా సంబంధాలు సాయం చేస్తాయని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా గతంలో భారత్ వచ్చిన విషయాన్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు.