telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భారీ వర్షాలు, వరదలు : సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

telangana cm kcr on CAA

భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ తో ఇవాళ సీఎం మాట్లాడారు. ‘‘హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరింది. నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Related posts