ఆ పేరే ఒక వైబ్రేషన్.. కోట్లాది అభిమానుల గుండెల్లో ఎన్నటికీ చెరగని చిరునామా ఆ పేరు.. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ పవర్ పేరే పవన్ కల్యాణ్.. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.
మెడపై చెయ్యిపెట్టి రుద్దుకుంటూ.. అగ్రెసివ్ గా ఒక లుక్ ఇస్తే చాలు.. థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. చాలా మంది సిల్వర్ స్ర్కీన్ పై మాత్రమే హీరోలు. కానీ ఆయన రియల్ లైఫ్ లోనూ తనదైన సిద్ధాంతాల్ని నమ్మి ఫాలో అవుతారు. అందుకే ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులెక్కువ.
మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోగా.. స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
సక్సెస్ ఫెయిల్యూర్స్ కు అతీతంగా పవర్ స్టార్ గా అభిమానులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు.
అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్. అంచలంచలుగా ఎదుగుతూ.. తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 వచ్చిందంటే చాలు పవన్ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే.
ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో పవన్‌కళ్యాణ్ చేసింది కేవలం 27 సినిమాలు మాత్రమే. అందులో చాలా వరకు పరాజయాలే ఉన్నాయి. కానీ పవన్ మాత్రం మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది తర్వాత పవన్ కు ఆ స్థాయి సక్సెస్ దక్కి చాలా కాలమైంది.
అయినా అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది తప్పితే తగ్గలేదు. అజ్ఞాతవాసి, సర్ధార్‌గబ్బర్‌సింగ్ సినిమాలు ఫ్లాప్ అయినా టాలీవుడ్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో అవి ఉన్నాయంటే పవన్ పై అభిమానుల్లో ఉన్న అంతులేని అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు యావరేజ్ టాక్‌తో వంద కోట్లకుపై వసూళ్లను సాధించాయంటే పవన్ ఛరిష్మానే కారణం. మిగిలిన నటులతో పోలిస్తే పవన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ భిన్నంగా ఉంటుంది. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు. నటుడిగా ఆ విలక్షణీయతే పవన్‌ను స్టార్‌హీరోల్లో ఒకరిగా నిలబెట్టింది.
టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. కానీ ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఆడంబరాలకు దూరంగా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. సినిమాలు, రాజకీయాలు కాకుండా పుస్తక పఠనానికి పవన్ అధికంగా ప్రాధాన్యమిస్తుంటారు. తనను కలవడానికి వచ్చిన వారందరికి పుస్తకాలను బహుమతిగా అందిస్తుంటారు. పుస్తకాన్ని ప్రేమించండి…విజ్ఆ న ప్రపంచంలో జీవించండి అంటూ పలుమార్లు సోషల్ మీడియా ద్వారా పుస్తక పఠనం గొప్పతనాన్ని చాటిచెప్పారు.
పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు (శుక్రవారం).. ఈ రోజు పవన్ 51వ జన్మదినం కావడంతో సోషల్ మీడియాలో కోలాహలం నెలకొంది. పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఊరు వాడా ప్రతీ చోటా పవన్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. నిజానికి కొద్దిరోజుల ముందునుంచే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అలాగే పవన్ పుట్టిన రోజు కానుకగా ఆయన సూపర్ హిట్ సినిమాలు తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ ఆయిన విషయం తెలిసిందే