తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికులు మృతదేహాలను ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు మృతదేహాలను తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాత్రి జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో సహా ఇతర త్రివిధ దళాధిపతులుకు నివాళులర్పించారు. వారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అంతకు ముందు ఎయిర్‌బేస్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పార్థివ దేహాలకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. అమరుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు దిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటివద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు తీసుకెళ్తారు.
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల సమీపంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది ప్రాణాలను కోల్పోయారు.
బిపిన్ రావత్‌తోపాటు 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో చెప్పడం జరిగింది.ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది. బుధవారమే మానవేంద్ర బృందం వెల్లింగ్టన్ చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టింది”అని రాజ్‌నాథ్ చెప్పారు.