telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్ర‌ధాని ఏపీ టూర్‌లో న‌ల్ల బెలూన్లు క‌ల‌క‌లం..

మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. తరువాత హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్లకు బయలు దేరారు.

అయితే ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ బెలూన్లు ఎగరేసారు. ఈ బెలూన్లు ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అత్యంత సమీపంలో ఎగరడం తీవ్ర కలకలం రేగింది.

ప్రధాని ప్రయాణించే మార్గంలో బెలూన్లు ప్రత్యక్షం కావడాన్ని సెక్యూరిటీ లోపంగా పరిగణిస్తూ కేంద్రం సీరియస్ గా తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఘ‌టనపై విచార‌ణ చేప‌ట్టామ‌ని పోలీసులు వెల్లడించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నల్ల బెలూన్లు ఎగరేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నించారు.  విజయవాడ సమీపంలోని ఓ కన్ట్రక్షన్ బిల్డింగ్ పై నుండి ఈ బెలూన్లు ఎగరేసినట్లు గుర్తించారు.

బెలూన్లు ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విజయ్ పాల్ తెలిపారు. మరికొంత మందిని అరెస్ట్ చేయవలసి వుందన్నారు. ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి వైఫల్యం లేదని డిఎస్పీ తెలిపారు.

కాగా ప్రధాని మోదీ పర్యటనలో కాంగ్రెస్‌ నిరసనలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. గ‌న్నవరం విమానాశ్రయం సమీప ప్రాంతం ప్రధాని పర్యటిస్తోంటే కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేశారని ఆయన మండిపడ్డారు.

హెలికాప్టర్ సమీపంలో బెలూన్లు ఎగురవేయడం వెనక కుట్ర ఉందని, ప్రధాని మోదీపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘనటపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటన వెనుక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related posts