telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కేంద్ర మంత్రి గడ్కరీతో ముగిసిన జ‌గ‌న్ భేటి..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూడిల్లీ పర్యటన రెండోరోజు కొన‌సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఏపీలో జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధిపై గంట‌పాటు చ‌ర్చించారు.

ap cm ys jagan delhi tour...meeting with union minister nitin gadkari

నిన్న ప్రధానితో సమావేశం అయిన సీఎం జగన్ ఇవాళ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు..ఈ క్ర‌మంలోనే గడ్కరీ క‌లిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో 4లైన్ల రోడ్డును విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి నిర్మించాలని అన్నారు.

విశాఖకు ఈ రహదారి చాలా ఉపయోగకరంగా వుంటుందని… ఇది పూర్తయితే పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను మరింత తొందరగా సరుకుల రవాణా చేయవచ్చని తెలిపారు. రహదారి అందుబాటులో వస్తే ఈ రాష్ట్రాలకు దూ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని జగన్ కేంద్ర మంత్రి గడ్కరీకి తెలిపారు. విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని సీఎం జగన్‌ కోరారు.

ఆ తర్వాత కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌తోనూ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్‌. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు అంశాలపై చర్చించారు.

Related posts